Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాళ్ల దాడి…కోడి కత్తి ఏదినిజం ఏది అబద్దం …?

రాళ్ల దాడి…కోడి కత్తి ఏదినిజం ఏది అబద్దం …?
-నాయకులే సింపతి కోసం తమపై దాడులు చేయించుకుంటున్నారా?
-జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి అబద్దమా ?
చంద్రబాబుపై జరిగిన రాళ్లదాడి నిజామా ?
-వైకాపా , టీడీపీ పరస్పర ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అచ్చం తమిళనాడు రాజకీయాలను తలపిస్తున్నాయి. అక్కడ కూడా ప్రాంతీయ పార్టీల మధ్య పోరు రసవత్తరంగా ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అదే విధంగా ఉంది.జగన్ ప్రతిపక్ష నేతగా ఉండగా విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఒక వ్యక్తి కోడి పందేలకు ఉపయోగించే కత్తితో ఆయన పై దాడి చేశారు. దీనిపై టీడీపీ ,అప్పటి పోలీస్ అధికారులు జగన్ కావాలనే కోడికత్తి డ్రామా ఆడారని , దాడి చేసిన వ్యక్తి వైకాపాకు చెందినవాడని ఆరోపించింది. అందుకు సంబందించిన జగన్ బొమ్మతో దాడి చేసిన వ్యక్తి కలిసిఉన్న పోస్టర్లను సైతం ప్రదర్శించారు. కోడికత్తితో దాడి చేసిన వ్యక్తి దొరికాడు . ఆయన విశాఖ ఎయిర్ పోర్ట్ లాంజ్ క్యాంటిన్ లో తెలుగుదేశంకు సంభందించిన వ్యక్తి క్యాంటిన్ లో పని చేస్తున్నట్లుగా గుర్తించారు. అయితే అతను ఎందుకు జగన్ పై దాడి చేయాల్సి వచ్చింది. అనేది ఇంతవరకు వెల్లడి కాలేదు. నిజంగా జగన్ తనపై దాడి చేయించుకున్నారా? తెలుగుదేశం వాళ్ళు పధకం ప్రకారం చేయించారా? అనేది ఇంతవరకు తేలలేదు. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా దాని గురించిన ప్రస్తావన లేదు. అచ్చం అలంటి సంఘటనే తిరుపతి చంద్రబాబు రోడ్ షో సందర్భంగా జరిగింది. ఎవరో ఒక వ్యక్తి తనపై రాళ్ళూ విసిరారని చంద్రబాబు ఆరోపణ .ఆయన ప్రసంగం ముగింపులో ఒకరాయి పడ్డట్లు కలకలం రేగింది. అసలు రాయి ఎక్కడనుంచి వచ్చింది ఎవరు విసిరారు అనేది ఎవరికీ తెలియటంలేదు. అసలు రాయి వచ్చిందా ? రాలేదా ? చంద్రబాబు ఓటమి భయం పట్టుకొని వైకాపా రాళ్ల దాడి చేశారని అంటూ డ్రామాలు ఆడుతున్నారా ? అనే సందేహాలు కలిగించేలా వైకాపా నేతలు మాట్లాడుతున్నారు. వెంటనే ఆరాయి ఇటు ఇవ్వడి ,ఇటు ఇవ్వండి అని అడిగి రాయిని తనదగ్గరకు తెప్పించుకొని సభలోనే దాన్ని చూపిస్తూ ఏమి తమాషాగా ఉందా? తోలుతీస్తా ? తాటతీస్తా ? నాతో పెట్టుకోవద్దు అంటూ చంద్రబాబు గర్జించారు. రౌడీ రాజ్యం నశించాలని నినదించారు. అక్కడే రోడ్ పైనే కూర్చొని ఆందోళనకు దిగారు . అక్కడ నుంచి దగ్గరలో ఉన్న ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. దెబ్బలు తగిలాయని చెప్పబడుతున్న ఇద్దరు వ్యక్తుల చేత కేసు పెట్టించారు. దోషులపై చర్యలకు డిమాండ్ చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దెబ్బలు తగిలిన వారితో పాటు చుట్టుపక్కల ఉన్న వారిని విచారించారు. ఈ సంఘటనపై డి ఐ జి క్రాంతిరానా టాటా మీడియా వారితో మాట్లాడుతూ చంద్రబాబు రోడ్ షో సందర్భంగా అక్కడ ఎలాంటి సంఘటన జరిగినట్లు తమకు ఆధారాలు లభించలేదని ,తాము సీసీ ఫుటేజ్ ,వీడియో లు పరిశీలించామని అన్నారు. టీడీపీ వారి దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటె తమకు అందజేస్తే వాటిని కూడా పరిశీలిస్తామని అన్నారు. దీనిపై వెంటనే స్పందించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా తో మాట్లాడుతూ రాయి నిజంగా వేస్తె వారు ఎవరైనా చివరకు మాపార్టీ వారైనా పోలీసులకు అప్పగిస్తామని అన్నారు. కానీ చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ,ఓటమి గ్రహించిన చంద్రబాబు ఇలాంటి జిమ్మిక్కులు చేయటంలో దిట్ట అని అన్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ,చంద్రబాబు పై రాయి విసిరితే ఎవరికో కాళ్లకు దెబ్బలు తగలటం ఏమిటి ? తలపై తగలాలి కదా అని లాజిక్ తీశారు. పోలిసుల ప్రకటనపై చంద్రబాబు స్పందించారు. గూడూరు రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ తమపై రాళ్ల దాడి జరిగితే ఈ పోలీసులు పట్టించుకోలేదు సరికదా పైగా పూలుపడ్డాయని అంటున్నారు.దాడి చేసిన దోషులను దర్జాగా పంపించారని విమర్శించారు.. పోలీసులు కూడా సరెండర్ అయ్యారని ఆరోపించారు. రాష్ట్రానికి జగన్ వైరస్ పట్టుకుంది .దాన్ని ఓట్లు అనే మందు ద్వారానే పారదోలాలి అన్నారు. లేకపోతె నష్టం జరుగుతుంది జాగ్రత్త సుమా అని హెచ్చరించారు. వైకాపా , టీడీపీ . మధ్య బద్ధవైరం ఉంది. ఒకరు అవునంటే మరొకరు కాదంటారు . రాష్ట్రం విడిపోయిన తరువాత మొదటిసారి 2014 జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించి అధికారంలోకి వచ్చింది . రాష్ట్రానికి రాజధాని ఎక్కడ పెట్టాలనే అంశం పై ముందుగానే చంద్రబాబు నిర్ణయం తీసుకొని తన అనుయాయులకు లబ్ది చేకూరే విధంగా వారికీ లీకులు ఇచ్చి వారిచేత అక్కడ భూములు కొనిపించి భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని వైకాపా ఆరోపణ . అప్పుడు శానసభ సమావేశాలు హాట్ హాట్ గా జరిగాయి. వైకాపా నుంచి 67 మంది శానసభ్యులు ఎన్నిక కాగా 23 టీడీపీలో చేరారు. దానిపై రగిలి పోతున్న జగన్ తిరిగి 2019 శానసభకు జరిగిన ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకున్నారు. జగన్ నాయకత్వంలోని వైయస్ ఆర్ సీపీ ఘనవిజయం సాధించింది . శాసనసభలో ఉన్న 175 సీట్లలో 151 సీట్లు గెలుచుకొని రాజకీయ పండితుల అంచనాలను సైతం ఆశ్చర్యపరిచింది . చంద్రబాబు నాయకత్వంలో ఉన్న టీడీపీ కేవలం 23 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. పోలైన ఓట్లలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి 51 శాతం ఓట్లు రాగ ,టీడీపీకి కేవలం 40 ఓట్లు మాత్రమే వచ్చాయి. అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృధ్ధికోసం చర్యలు చేపట్టింది. అమరావతిని శాసన రాజధాని తో పాటు విశాఖలో పరిపాలన రాజధాని , కర్నూల్ లో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలనీ నిర్ణయించారు. శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానించారు.మండలిలో టీడీపీకి మైజార్టి ఉండటంతో అక్కడ మూడు రాజధానుల తీర్మానానికి టీడీపీ అడ్డుతగిలింది . దీనిపై కొందరు కోర్ట్ కెళ్లారు. రాజధాని ఒకటే ఉండాలి మూడు రాజధానులు అనేది తుగ్లక్ చర్య అని టీడీపీ విమర్శిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కన్ఫ్యూజన్ స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. మూడు రాజధానులపై వారి వాదనలు విచిత్రంగా ఉన్నాయి . కర్నూల్ లో న్యాయ రాజధాని కావాలని అంటుంది. కాని అమరావతి అసలు రాజధానిగా ఉండాలని అంటుంది. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం మాత్రం రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు కు కూడా అఫిడవిట్ ద్వారా తెలిపింది . దీనికి తోడు ముఖ్యమంత్రి జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి 2019 ఎన్నికలకు మూడు నెలల ముందు హత్యకు గురైయ్యారు . ఆయన్ను ఎవరు చంపారనేది ఇప్పటికి మిస్టరీ గానే ఉంది. దీనిపై కూడా వైకాపా , టీడీపీ మధ్య పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి. ప్రతి విషయాన్నీ రాజకీయ కోణంలో ఇరు పార్టీలు చూస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలైనా, చట్టసభలకు జరిగే ఎన్నికలైనా, పరస్పర ఆరోపణలతో రాష్ట్ర రాజకీయాలు నిరంతరం హీట్ పుట్టిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ సమస్యలు ఎజెండాగా ఎన్నికలు ఉంటాయని రాజకీయ పరిశీలకులు భావించారు . ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ , పోలవరం ప్రాజెక్ట్ కు నిధులు ,రాజధాని లాంటి ఆంశాలపై తిరుపతి ఉపఎన్నికల్లో ఎజెండాగా ఉంటాయని అనుకున్నారు . కాని ఆఊసే లేకుండా పోయింది .బీజేపీ పోటీలో ఉండి టీడీపీ , వైకాపాల తగాదాలతో కేంద్రంపై విమర్శలు లేకుండా ఎన్నికల ప్రచారం సాగటంపై సంతోష పడుతుంది. వీరి తగాదాలు వర్ధిల్లాలని దీవిస్తుంది. ప్రజలు మాత్రం పార్టీల మధ్య తగాదాలను చాలా నిశితంగా పరిశీలిస్తున్నారు.

Related posts

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటల్లోమర్మమేమిటి …?

Drukpadam

స్పీకర్ పోచారం తీరుపై అసెంబ్లీలో చర్చ జరగాలి: బండి సంజయ్!

Drukpadam

శశికళతో బీజేపీ నేత విజయశాంతి భేటీ.. మంచి వారికి ఎప్పుడూ మంచే జరుగుతుందన్న నటి!

Drukpadam

Leave a Comment