అరెస్ట్ తర్వాత మమతకు నాలుగుసార్లు ఫోన్ చేసిన పార్థ ఛటర్జీ.. సీఎం నుంచి రెస్పాన్స్ కరవు!
- స్కూల్ జాబ్స్ కుంభకోణంలో అరెస్ట్ అయిన పార్థ ఛటర్జీ
- అరెస్ట్ విషయాన్ని మమతకు తెలిపే ప్రయత్నం చేసిన మంత్రి
- నాలుగుసార్లు ఫోన్ చేసినా కనికరించని మమత
- అర్పితను నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్న ఈడీ అధికారులు
స్కూల్ జాబ్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీకి చేదు అనుభవం ఎదురైంది. ఆయన అరెస్ట్ తర్వాత టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి నాలుగుసార్లు ఫోన్ చేసినా ఆమె నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఎవరైనా వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల్లో ఎవరో ఒకరితో ఆ విషయాన్ని పంచుకోవచ్చు.
ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తున్న సమయంలో తాను ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మమతకు చెప్పాలని పార్థ ఛటర్జీ అధికారులకు చెప్పారు. వారు అందుకు అంగీకరించారు. దీంతో నాలుగుసార్లు.. తెల్లవారుజామున 2.31, 2.33, 3.37, ఉదయం 9.35 గంటలకు ఆయన మమతకు ఫోన్ చేశారు. అయితే, మమత నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో తీవ్ర నిరాశ చెందారు. కాగా, ఇదే కేసులో అరెస్ట్ అయిన పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పిత ముఖర్జీకి కోర్టు ఒక రోజు రిమాండ్ విధించింది. నేడు ఆమెను పీఎంఎల్ఏ కోర్టులో హాజరు పరుస్తారు.