ముంబై- పూణె మధ్య ‘అరకు’ అనుభూతిని మించిన అద్దాల రైలు ప్రయాణం!
- ముంబై- పూణె రూట్లో కొత్తగా విస్టాడోమ్ కోచ్ రైలు ప్రవేశం
- సోమవారం కొత్త రైలు ప్రయాణాన్ని ప్రారంభించిన రైల్వే శాఖ
- ఇరువైపులా అద్దాలతో పాటు పై భాగంలోనూ అద్దాలు ఈ రైలు ప్రత్యేకత
- 108 డిగ్రీస్‌లో తిరిగే రివాల్వింగ్ చైర్లు అదనపు ఆకర్షణ
సాగర నగరం విశాఖ నుంచి అరకు రైలు ప్రయాణం మధురానుభూతిని ఇస్తున్న వైనం తెలిసిందే. అద్దాల రైలులో వెళుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సాగే ఈ ప్రయాణం నిజంగానే మరపురాని అనుభూతిని ఇస్తుంది. ఇలా అరకు అద్దాల రైలు అనుభూతిని మించిన రైలు ప్రయాణం ముంబై- పూణె మధ్య కూడా సోమవారం అందుబాటులోకి వచ్చింది. ఇరువైపులా అద్దాలతో పాటు రైలు పైభాగం కూడా అద్దాలతో కూడిన ఈ రైలు ప్రయాణం మరింత అనుభూతిని ఇస్తోందంటూ భారతీయ రైల్వే శాఖ వెల్లడించింది.
ఇదివరకు ఈ రూట్లో ప్రయాణించిన రైలు స్ధానంలో విస్డాడోమ్ కోచ్ రైలుతో ప్రవేశపెట్టిన ఇండియన్ రైల్వేస్ నిన్న ఈ కొత్త రైలు ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ రైలులో 180 డిగ్రీస్‌లో తిరిగే రివాల్వింగ్ చైర్‌లను ఏర్పాటు చేశారు. ప్రతి రోజు ఈ రైలు పూణె నుంచి ముంబైకి… తిరిగి ముంబై నుంచి పూణెకు వెళుతుంది. ఈ రైలులోని సౌకర్యాల ఫొటోలను కూడా జత చేస్తూ రైల్వే శాఖ సోమవారం ఓ ట్వీట్ చేసింది. ఈ ఫొటోలను చూస్తుంటే… అరకు అద్దాల రైలు అనుభూతిని మించిన అనుభూతి దక్కడం ఖాయమేనని చెప్పక తప్పదు.