త్వరగా ఎక్కువ ఆపరేషన్లు చేయాలన్న టార్గెట్ వల్లే కు.ని. మరణాలు: గవర్నర్ తమిళిసై!
- ఇలా నలుగురు చనిపోవడం మామూలు విషయం కాదని వ్యాఖ్య
- ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగుపర్చాలని ప్రభుత్వానికి సూచన
- ఇలాంటి ఘటనలు తిరిగి జరగకూడదన్న గవర్నర్
త్వరగా ఎక్కువ ఆపరేషన్లు చేయాలన్న టార్గెట్, ఆ సమయంలో ఇన్ఫెక్షన్ వల్లే కుటుంబ నియంత్రణ చికిత్సలు వికటించి నలుగురు మహిళలు చనిపోయి ఉంటారని ఒక డాక్టర్‌గా తాను భావిస్తున్నట్లు తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. కుటుంబ నియంత్రణ చికిత్సలు అంటే మరింత మంది ముందుకు వచ్చేలా చేయాలని.. జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు తిరిగి జరగకూడదని.. ఎక్కువ ఆపరేషన్లు చేయాలన్న టార్గెట్లు సరికాదని స్పష్టం చేశారు.
నిమ్స్ లో మహిళలను పరామర్శించి..
తెలంగాణలోని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ చికిత్సలు వికటించి నలుగురు చనిపోవడం, మరికొందరు మహిళలు ఇన్ఫెక్షన్ బారినపడటం తెలిసిందే. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను గవర్నర్ తమిళిసై పరామర్శించారు. ఇలా కు.ని. చికిత్సలు వికటించి చనిపోవడం మామూలు విషయం కాదని, ఆమోద యోగ్యం కాదని గవర్నర్ పేర్కొన్నారు. దీనిపై విచారణ జరుగుతోందని తెలిపారు. వైద్యుల నివేదిక వచ్చాక పూర్తి కారణాలు తెలుస్తాయని వెల్లడించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగు పరచాలని ప్రభుత్వానికి లేఖ రాస్తానని గవర్నర్ తెలిపారు. నిమ్స్‌లో జరుగుతున్న చికిత్సలపై బాధితులు సంతృప్తిగా ఉన్నారన్నారు. బాధితులు ఆర్థిక సాయం కోరుతున్నారని.. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని వివరించారు.