కింగ్స్ వే అన్నా, రాజ్ పథ్ అన్నా అది బానిసత్వానికి చిహ్నం లాంటిదే… ఇప్పుడది చరిత్ర చాటుకు వెళ్లిపోయింది: ప్రధాని మోదీ
- ఢిల్లీలో సెంట్రల్ విస్టా ప్రారంభోత్సవంలో మోదీ
- నేతాజీ విగ్రహావిష్కరణ చేసిన ప్రధాని
- కర్తవ్య పథ్ కు ప్రారంభోత్సవం
- దేశానికి కొత్త స్ఫూర్తి అంటూ ప్రసంగం
ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో సెంట్రల్ విస్టా అవెన్యూ ప్రారంభించారు. ఇందులో భాగంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అటుపై, కర్తవ్య పథ్ ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ…. కింగ్స్ వే అనండీ, లేక రాజ్ పథ్ అనండీ… అది బానిసత్వానికి చిహ్నం లాంటిదే. ఇప్పుడది చరిత్ర చాటుకు వెళ్లిపోయింది అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలకు వేదికగా నిలిచే రాజ్ పథ్ ను కర్తవ్య పథ్ గా మార్చడం తెలిసిందే. రాజ్ పథ్ ను బ్రిటీష్ హయాంలో కింగ్స్ వే అని పిలిచేవారు.
సెంట్రల్ విస్టా ప్రారంభోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో మోదీ…. దేశం ఇవాళ కొత్త శక్తిని, స్ఫూర్తిని అందిపుచ్చుకున్నాయని పేర్కొన్నారు. ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసిన నేతాజీ విగ్రహం మనకు మార్గదర్శనం చేస్తుందని తెలిపారు.
నేతాజీ చూపిన మార్గంలో గనుక భారత్ పయనిస్తే, అనతికాలంలోనే ఉన్నత శిఖరాలకు ఎగబాకుతుందని అన్నారు. విచారకరమైన విషయం ఏమిటంటే, నేతాజీ భావనలు, ఆశయాలు పెద్దగా ఆదరణకు నోచుకోలేదని, ఆయనను మర్చిపోయారని వ్యాఖ్యానించారు.
తాము అధికారంలోకి వచ్చాక ఈ ఎనిమిదేళ్లుగా నేతాజీ సిద్ధాంతాలు, కలలను సాకారం చేసేందుకు కృషి చేస్తున్నామని మోదీ చెప్పారు. ఈ దిశగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. ఇక, రాజ్ పథ్ బ్రిటీష్ కాలం నాటి దాస్య శృంఖలాలకు నిదర్శనం అని, ఇప్పుడు కర్తవ్య పథ్ గా పేరు మార్పుతో దాని రూపు, స్ఫూర్తి కూడా మారిపోయాయని తెలిపారు.