సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లను వెనక్కి తీసుకున్న సీఎం జగన్, విజయసాయిరెడ్డి!
- ఆదాయానికి మించిన ఆస్తుల కేసు
- తొలుత సీబీఐ కేసులే విచారించాలన్న తెలంగాణ హైకోర్టు
- సీఎం జగన్, విజయసాయిలకు అనుకూలంగా తీర్పు
- సుప్రీంలో పిటిషన్ల అవసరంలేదని భావించిన జగన్, విజయసాయి
ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో తొలుత సీబీఐ కేసులపైనే విచారణ జరపాలని నిన్న తెలంగాణ హైకోర్టు ఏపీ సీఎం జగన్, విజయసాయి తదితరులకు అనుకూలంగా తీర్పునివ్వడం తెలిసిందే. ఈడీ కేసులనే మొదట విచారణ చేపడతామన్న సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో, సీఎం జగన్, విజయసాయిరెడ్డి సుప్రీంకోర్టులో తాము దాఖలు చేసిన పిటిషన్లను వెనక్కి తీసుకున్నారు. తెలంగాణ హైకోర్టులో తమకు ఊరట లభించడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.
సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణ ముగిసిన తర్వాతే ఈడీ కేసుల విచారణ చేపట్టాలంటూ వారు సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు వేశారు. ఇప్పుడీ పిటిషన్లను జగతి పబ్లికేషన్స్, కార్మెల్ ఏషియా హోల్డింగ్స్ ఉపసంహరించుకున్నాయి. విజయసాయిరెడ్డి కూడా తన పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు.
తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించినందున పిటిషన్లు వెనక్కి తీసుకుంటున్నట్టు సుప్రీంకోర్టుకు పేర్కొన్నారు. ఈ మేరకు జగతి పబ్లికేషన్స్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వి సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఇక, భారతి సిమెంట్స్ పిటిషన్ పై రెండు వారాల తర్వాత విచారణ జరపనున్నట్టు అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది.