తిరుపతిలో దొంగ ఓట్లపై ఫిర్యాదుల వెల్లువ … ఎన్నిక రద్దు చేయాలనీ విపక్షాల డిమాండ్
-పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే దొంగ ఓట్లపై కలకలం
-మీడియా ఉరుకులు పరుగులు
-ఆర్డీఓ కార్యాలముందు బీజేపీ,టీడీపీ పార్టీల ధర్నా
-తిరుపతిలోకి భారీగా బయటి వ్యక్తులు వచ్చారు: చంద్రబాబు ఆరోపణ
-వందలమందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించాం
-విపక్షాల ఆరోపణలపై మండిపడిన వైసీపీ అభ్యర్థి గురుమూర్తి
-కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్య
– చంద్రబాబు తన విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు: సజ్జల వ్యంగ్యం
విపక్షాల ఆరోపణలను కొట్టిపారేసిన మంత్రి పెద్దిరెడ్డి
తిరుపతి పోలింగ్ పై వివిధ పార్టీల నేతలు స్పందించారు
దొంగఓట్లపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు
తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఇవాళ తిరుపతిలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని, ఇక్కడికి భారీగా బయటి వ్యక్తులు వచ్చారని ఆరోపణలు చేశారు. బందిపోట్లను తలపించేలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు.
పోలింగ్ నేపథ్యంలో సరిహద్దులు మూసేసి, తనిఖీలు చేసి పంపించాల్సిందని అన్నారు. కానీ పోలీసులు ఎందుకు చెక్ పోస్టులు ఎత్తివేశారని ప్రశ్నించారు. ఇతర ప్రాంతాల నుంచి వేలమంది వస్తే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు, అధికారులు ఉన్నది జగన్ అనే వ్యక్తి కోసం కాదని… పోలీసులు, అధికారులు ప్రజాస్వామ్యం కోసం పనిచేయాలని హితవు పలికారు.
మంత్రి పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్ లో వేలమందిని ఉంచారని చంద్రబాబు ఆరోపించారు. బయటి వ్యక్తులు తిరుపతిలో ఉంటే పోలీసులు ఎందుకు గుర్తించలేదని నిలదీశారు. దొంగ ఓటర్లను పట్టుకున్న టీడీపీ నేతలపై కేసులు పెట్టారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరుకు చెందిన పెద్దిరెడ్డి తిరుపతిలో ఎందుకున్నారని ప్రశ్నించారు. తిరుపతి ప్రాంతానికి పెద్ద సంఖ్యలో జనాన్ని తీసుకువచ్చి పర్యాటకులు అంటున్నారని విమర్శించారు.
ఉప ఎన్నిక పోలింగ్ కోసం కేంద్రం పంపిన బలగాలు ఏమయ్యాయి? వెబ్ కాస్టింగ్ నిర్వహణ ఏమైంది? మేం వందలమందిని రెండ్ హ్యాండెడ్ గా పట్టించాం అని అన్నారు. తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా చోటు చేసుకుంటున్న అన్ని అక్రమాలపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. విపక్షాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటే, వైసీపీ మాత్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు.
పోలీసులు, పోలింగ్ సిబ్బంది ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంపై నమ్మకం కలిగించే బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. తిరుపతి అసెంబ్లీ స్థానం పరిధిలో జరిగిన పోలింగ్ అక్రమాల మయం అని, ఇక్కడి పోలింగ్ ను రద్దు చేయాలని కోరుతున్నామని తెలిపారు. పూర్తిగా కేంద్ర బలగాలు, సిబ్బందితో మళ్లీ పోలింగ్ నిర్వహించాలని, తద్వారా ప్రజల్లో విశ్వాసం కలిగించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని అన్నారు.
వైకాపా అభ్యర్థి గురుమూర్తి స్పందన
.
తిరుపతి నుంచి బయటి ప్రాంతాలకు వెళ్లిన వాళ్లు తిరిగొచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటుంటే… కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అంతకుముందు మన్నసముద్రంలో డాక్టర్ గురుమూర్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
వైకాపా నేత సజ్జల స్పందన
తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం ఊపందుకుంది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా తమపై అనవసరంగా దొంగ ఓట్ల ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు గత రెండు, మూడు రోజుల నుంచి విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడని విమర్శించారు. ప్రతిదీ కుట్రపూరితంగా ఆలోచించడం చంద్రబాబు నైజం అని, తాను ఎలాంటి ముగింపు ఉండాలని కోరుకుంటాడో అందుకోసం అన్నిరకాల ప్రణాళికలు వేస్తాడని వెల్లడించారు. ఆనాడు తన మామ ఎన్టీఆర్ ను దింపడానికి ఏమేం విద్యలు ప్రదర్శించాడో, గత 40 ఏళ్లుగా ఆ విద్యలన్నింటికీ మరింత పదును పెట్టాడని సజ్జల వ్యాఖ్యానించారు. అప్పట్లో తాను యువ పాత్రికేయుడ్నని వెల్లడించిన సజ్జల… ఎన్టీఆర్ కు ఆవేశం తెప్పించి అసెంబ్లీ రద్దు చేసే పరిస్థితిని చంద్రబాబు కల్పించాడని వివరించారు. ఎమ్మెల్యేలందరూ కట్టకట్టుకుని తనవైపు వచ్చేలా దూరాలోచన చేసిన చంద్రబాబు… ఇప్పుడు తిరుపతి ఎన్నిక సందర్భంగా సాధారణ రీతిలో ఆలోచిస్తాడని తామనుకోలేదని స్పష్టం చేశారు. తాము ప్రజలనే నమ్ముకున్నామని, ప్రజలు తమవైపే ఉన్నారన్నది ఇటీవల ముగిసిన స్థానిక ఎన్నికల్లోనూ అది నిరూపితమైందని అన్నారు. అయితే కొవిడ్ నేపథ్యంలో పోలింగ్ శాతంపై అందరిలోనూ సందేహాలు ఉన్నాయని వెల్లడించారు. సింగిల్ ఎన్నిక కాబట్టి ఓటర్లలో నిరాసక్తత రాకుండా వారిని ఉత్సాహపరిచేలా వైసీపీ ప్రచారం సాగిందని చెప్పారు. కానీ రెండు, మూడు రోజుల నుంచి టీడీపీ ప్రచార సరళి మారిందన్నారు. తిరుపతి బరిలో బయటి వ్యక్తులు వస్తారని ఆరోపణలు చేయడం ప్రారంభించారని తెలిపారు. “తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నిక పరిధిలో చంద్రబాబు మిగతా అసెంబ్లీ స్థానాలను వదిలేసి తిరుపతినే టార్గెట్ చేయడం వెనుక లోతైన కుట్ర ఉంది. తిరుపతికి దేశం నలుమూలల నుంచి వేలమంది భక్తులు వస్తుంటారు కాబట్టి వారిని దొంగ ఓటర్లుగా ముద్ర వేసే తంతుకు తెరదీశారు. తమకు అనుకూల మీడియా సాయంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి తిరుపతిలో ఎందుకున్నాడంటూ ప్రశ్నిస్తున్నారు. పెద్దిరెడ్డికి తిరుపతిలో సొంత ఇల్లు ఉంది. నీలాగా కబ్జాలు చేసి కట్టుకోలేదు” అని మండిపడ్డారు. “ఎక్కడైనా దొంగ ఓటర్లను బస్సులు పెట్టి తీసుకువస్తారా… అది నీకు అలవాటు తప్ప మరెవ్వరూ చేయరు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఈ ఎన్నిక నిర్వహిస్తోంది కేంద్రం… కేంద్ర బలగాలు, సిబ్బంది పర్యవేక్షణలో జరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఇక్కడ పోటీ చేస్తోంది. ఇన్ని ఉండగా, ఇవన్నీ దాటుకుని దొంగ ఓట్లు ఎవరు వేయిస్తారంటే… డిపాజిట్లు కూడా రావని భావించే టీడీపీ కానీ, దాంతో పోటీ పడే బీజేపీ కానీ చేయాలి” అని అభిప్రాయపడ్డారు.
మంత్రి పెద్దిరెడ్డి స్పందన
తిరుపతిలో దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ వస్తోన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రతిపక్ష పార్టీలకు మద్దతు లేకపోవడంతోనే దొంగ ఓట్లు అంటూ తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము కూడా ఆయా పార్టీల నేతల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ప్రణాళికబద్ధంగానే దొంగ ఓట్ల ఆరోపణల డ్రామాను ప్రతిపక్ష పార్టీలు ఆడుతున్నాయని ఆయన ఆరోపించారు. తిరుపతికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని పట్టుకుని దొంగ ఓట్లు వేయడానికి వచ్చారా? అంటూ ప్రశ్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తిరుపతి యాత్రా స్థలం కావడంతోనే ఆ ప్రాంతానికి ప్రైవేటు బస్సులు వస్తాయని, ఆ బస్సులను వైసీపీవిగా చిత్రీకరించడం కుట్రపూరితమేనని చెప్పారు. తనపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే ఊరుకోనని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే తమపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఓటమి భయంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తనపై నారా లోకేశ్ చేస్తోన్న ఆరోపణలు సరికాదని చెప్పారు.
రత్నప్రభ బీజేపీ అభ్యర్థి
తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ దొంగ ఓట్ల అంశంపై స్పందించారు. తిరుపతి నగరం ఎంతోమంది ఉన్నత విద్యావంతులకు నిలయం అని తెలిపారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ అభివృద్ధిని కోరుకుంటున్నారని, అధికార మార్పును అభిలషిస్తున్నారని వివరించారు. అయితే డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి వందలాది బస్సుల్లో తరలించిన లక్షలాది మంది బోగస్ ఓటర్లతో కొనసాగుతున్న ఈ ఎన్నికలను రద్దు చేయాలని రత్నప్రభ డిమాండ్ చేశారు. మళ్లీ ఎన్నికలు జరపాలని ఎన్నికల పరిశీలకులను కోరారు.తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక సందర్భంగా అధికార వైసీపీ దొంగ ఓటర్లను బస్సుల్లో తరలిస్తోందని బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ-జనసేన నాయకులు, కార్యకర్తలు తిరుపతిలో ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. అధికార వైసీపీ బోగస్ ఓటర్లతో పాల్పడుతున్న రిగ్గింగ్ రాజకీయాలకు చరమగీతం పాడాలని, జగన్ పాలనలో అంపశయ్యపై ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వారు నినాదాలు చేశారు.