‘ఉక్రెయిన్ మెడికో’లకు సీట్లు ఇవ్వలేం.. సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వం!
- ఉక్రెయిన్‌లో చదువుతున్న వారు నీట్‌కు హాజరయ్యారన్న కేంద్రం
- ఇక్కడ సీట్లు సాధించేంత ర్యాంకులు సాధించలేకపోయారని వెల్లడి
- ఈ కారణంగానే వారంతా ఉక్రెయిన్ కళాశాలల్లో చేరారని వివరణ
- సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం
రష్యాతో యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో అభ్యసిస్తున్న వైద్య విద్యను మధ్యలోనే వదిలేసి వచ్చిన భారతీయ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం గురువారం షాకిచ్చింది. ఉక్రెయిన్‌లో విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులకు మన దేశంలోని వైద్య కళాశాలల్లో సీట్లను సర్దుబాటు చేయలేమని కేంద్రం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు గురువారం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఓ కీలక అంశాన్ని తన అఫిడవిట్‌లో ప్రస్తావించింది. ఉక్రెయిన్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న వారంతా భారత్‌లోని మెడికల్ కాలేజీల్లో సీట్లు సంపాదించేందుకు నీట్ పరీక్షకు హాజరయ్యారని కేంద్రం తెలిపింది. అయితే భారత్‌లో వారికి సీటు సాధించే స్థాయిలో ర్యాంకులు రాలేదని తెలిపింది. ఇక్కడ సీట్లు రాని కారణంగానే వారంతా ఉక్రెయిన్‌లోని మెడికల్ కాలేజీల్లో చేరారని పేర్కొంది. ఈ నేపథ్యంలో మన కాలేజీల్లో సీటు సంపాదించలేని విద్యార్థులకు ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితులను కారణంగా చూపి సీట్లు ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పింది.