ఏపీ శాసనసబా డిప్యూటీ స్పీకర్ పదవికి నోటిఫికేషన్ జారీ అయింది. ఇప్పటి వరకు డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరించిన కోన రఘుపతి తన పదవికి రాజీనామా చేసారు. కొద్ది నెలల క్రితం జరిగిన మంత్రివర్గ విస్తరణలో భాగంగా.. సీఎం జగన్ కొందరిని కేబినెట్ నుంచి తప్పించారు. మంత్రి పదవులు వీడిన వారి సామాజిక వర్గాలకు ఇతర అవకాశాలతో భర్తీ చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా.. వైశ్య సామాజిక వర్గం నుంచి మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ స్థానం ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ తో భర్తీ చేయనున్నారు.
దీంతో..డిప్యూటీ స్పీకర్ గా అదే సామాజిక వర్గానికి చెందిన విజయనగరం ఎమ్మెల్యే కొలగొట్ల వీరభద్ర స్వామిని నిర్ణయించారు. ఈ సాయంత్రం ఆయన నామినేషన దాఖలు చేయనున్నారు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక ఖాయంగా కనిపిస్తోంది. సభలో స్పీకర్ తమ్మినేని డిప్యూటీ స్పీకర్ ఎన్నిక పైన ప్రకటన చేసారు. ఈ సాయంత్రం వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. వీరభద్రస్వామి విజయనగరం జిల్లాలో వైసీపీకి కీలక నేతగా వ్యవహరించారు. మంత్రివర్గ విస్తరణలో ఆయనకు అవకాశం దక్కుతుందని భావించినా.. సీనియర్ నేత బొత్సా… ఎస్టీ వర్గానికి అదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉండటంతో అవకాశం దక్కలేదు. గతంలో ఎమ్మెల్సీగానూ వీరభద్ర స్వామి పని చేసారు., కోన రఘుపతి సామాజిక వర్గానికి చెందిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ బోర్డ్ ఉపాధ్యక్షుడిగా కేబినెట్ హోదా పదవి కేటాయించారు. తొలుత ఈ పదవి కోసం మాజీ మంత్రి కొడాలి నాని పేరు పరిశీలించినా.. అందుకు కొడాలి నాని సుముఖత వ్యక్తం చేయలేదు. మంత్రి పదవి నుంచి తప్పించటంతో మరో పదవి ఇచ్చారనే అభిప్రాయం ఏర్పడుతుందని..తాను ఎమ్మెల్యేగానే కొనసాగుతానని కొడాలి నాని స్పష్టం చేసారు. దీంతో..మల్లాది విష్ణుకు ఆ పదవి కేటాయించారు. సోమవారం మధ్నాహ్నం డిప్యూటీ స్పీకర్ గా కొలగట్ల వీరభద్ర స్వామి బాధ్యతలు చేపట్టనున్నారు.