Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

విజయవంతంగా టీయుడబ్ల్యూజే సంగారెడ్డి జిల్లా మహాసభ!

విజయవంతంగా టీయుడబ్ల్యూజే సంగారెడ్డి   జిల్లా మహాసభ!
-భారీగా తరలివచ్చిన జర్నలిస్టులు

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) సంగారెడ్డి జిల్లా ద్వితీయ మహాసభ గురువారం నాడు జిల్లా పరిషత్ హాలులో విజయవంతంగా జరిగింది. జిల్లాలోని సంగారెడ్డి, పటాన్ చెరువు, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాల నుండి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 11 గంటలకే హాలు కిక్కిరిసిపోవడంతో, 100మందికి పైగా జర్నలిస్టులు హాలు బయట కూర్చొని సమావేశాన్ని తిలకించడం విశేషం. జిల్లా అధ్యక్షులు కే.మల్లికార్జున్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో జిల్లా కార్యదర్శి విష్ణు కుమార్ తన నివేదికను సమర్పించారు. అతిథులుగా రాష్ట్ర హైండ్లూమ్ అభివృద్ధి సంస్థ ఛైర్మెన్ చింత ప్రభాకర్, రాష్ట్ర బేవరేజెస్ కార్పోరేషన్ ఛైర్మెన్ గజ్జెల నాగేష్, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు, మాజీ ఎమ్యెల్సి ఆర్.సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ, రాష్ట్ర కార్యదర్శి ఫైసల్ అహ్మద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రాజేష్, హెచ్.యు.జే కార్యదర్శి శిగా శంకర్ గౌడ్, జాతీయ కౌన్సిల్ సభ్యులు మురళీధర్ శర్మ, జిల్లా మాజీ కార్యదర్శి పి.కృష్ణ తదితరులు హాజరై సందేశాన్నిచ్చారు.

జర్నలిజం వృత్తి బాధ్యతతో కూడిందిటి.హెచ్.డి.సి.ఛైర్మెన్ చింత ప్రభాకర్

సమాజంలో బాధ్యతతో కూడిన వృత్తుల్లో జర్నలిజం ఒక్కటని, జర్నలిస్టులు నిత్యం అప్రమత్తంగా ఉంటూ వృత్తి ధర్మానికి న్యాయం చేయాలని రాష్ట్ర హైండ్లూమ్ అభివృద్ధి సంస్థ ఛైర్మెన్ చింత ప్రభాకర్ అన్నారు. కరోనా విపత్తులో జర్నలిస్టులు ప్రాణాలను ఫణంగా పెట్టి విధులను నిర్వర్తించడం వారి అంకితభావానికి నిదర్శనమన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లవేళలా తన సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

తెలంగాణోద్యమంలో కీలక పాత్ర..-టి.బి.సి ఛైర్మెన్ గజ్జెల నగేష్

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందని, కేవలం సమాచార సేకరణ వరకే పరిమితం కాకుండా ప్రత్యక్షంగా ఉద్యమంలో భాగస్వాములయ్యారని రాష్ట్ర బేవరేజెస్ కార్పోరేషన్ ఛైర్మెన్ గజ్జెల నగేష్ అన్నారు. జర్నలిస్టుల కష్ట సుఖాలపై సీఎం కేసీఆర్ కు స్పష్టమైన అవగాహన ఉందని, వారి సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

జర్నలిజం విలువల్ని కాపాడండి -సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్

పవిత్రమైన జర్నలిజం వృత్తిలో పతనమవుతున్న విలువల్ని పరిరక్షించే బాధ్యత జర్నలిస్టులపైనే వుంటుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. జర్నలిస్టులు కల్పిత కథనాలను కాకుండా, నిష్పక్షపాతంగా విమర్శనాత్మక కథనాలు, ప్రజలకు ప్రయోజనం చేకూర్చే కథనాల వైపు కలలను పదునెక్కించాలని సూచించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు అమలు పరిచే పథకాలపై ప్రజలను చైతన్యపర్చాలని ఆయన తెలిపారు. జిల్లాలో జర్నలిస్టులకు ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తెస్తే వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని ఆయన భరోసానిచ్చారు.

నైతిక విలువలకు కట్టుబడి ఉంటే జీవితాంతం గుర్తింపు…-టి.ఎస్.పి.ఎస్.సి సభ్యులు ఆర్.ఎస్ 

విధి నిర్వహణలో నైతిక విలువలకు కట్టుబడి వుండే జర్నలిస్టులకు వృత్తిలో ఉన్నా, లేకున్నా జీవితాంతం సమాజంలో గుర్తింపు ఉంటుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు, మాజీ ఎమ్యెల్సి ఆర్.సత్యనారాయణ అన్నారు. ప్రెస్ మీట్లు, ప్రెస్ నోట్లు మాత్రమే వార్తలు కావని, మానవవీయ కథనాలు, పరిశోధనాత్మక కథనాలు, విజయ గాధల సేకరణే నిజమైన వార్తలని, ఆ వైపు జర్నలిస్టులు దృష్టి సారించాలన్నారు. మెదక్ జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమానికి రాష్ట్రంలో నాటి నుండి నేటి వరకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. కేవలం జర్నలిస్టుల హక్కుల సాధనకే పరిమితం కాకుండా సామాజిక ఉద్యమాలను భుజస్కంధాలపై మోసుకొని పోరాడిన ఘన చరిత్ర ఈ జిల్లా జర్నలిస్టులకు ఉందన్నారు.

పోరాటాలు,త్యాగాలు టీయూడబ్ల్యూజేకే సాధ్యం – జర్నలిస్టు సంఘం నేత విరాహత్ అలీ

 

దాదాపు 65ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కలిగి ఉన్న తమ సంఘం నాడు ఉమ్మడి రాష్ట్రంలో, నేడు తెలంగాణ రాష్ట్రంలో లెక్కలేనన్ని పోరాటాలు, త్యాగాలు చేసి వేలాది జర్నలిస్టుల విశ్వాసాన్ని చూరగొందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ స్పష్టం చేశారు. దాదాపు 35 ఏండ్ల క్రితం వర్కింగ్ జర్నలిస్ట్స్ ఉద్యమంలో తనకు ఓనమాలు నేర్పి, పోరాటాల బాట నడిపించిన తన పురిటిగడ్డ ఉమ్మడి మెదక్ జిల్లాకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన అన్నారు. ఐదు పర్యాయాలు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా తనను ఎన్నుకొని ఆదరించిన ఈ జిల్లా జర్నలిస్టుల ఆదరాభిమానాలను తాను ఏ స్థాయిలో ఉన్నా మరచిపోలేనని, తన సేవలతో వారి రుణం తీర్చుకుంటానని ఆయన చెప్పారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం మీడియా పట్ల సమాజంలో విశ్వాసం సన్నగిల్లుతుందని, అక్రమ సంపాదనే మార్గంగా కొన్ని అసాంఘిక శక్తులు జర్నలిజంలోకి ప్రవేశిస్తూ పవిత్రమైన వృత్తిని భ్రష్టు పట్టిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అడ్వర్టైజ్మెంట్ల కోసం అలాంటి శక్తులను యాజమాన్యాలు ప్రోత్సహించడం వృత్తి ధర్మానికి ద్రోహం చేయడమేనని విరాహత్ విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల సాధనకై తమ సంఘం అహర్నిశలు శ్రమిస్తుందని, మీడియా స్వేచ్ఛ పరిరక్షణలో పాటు జర్నలిస్టుల కనీస అవసరాలైన ఇంటి స్థలాలు, ఇండ్లు, ఆరోగ్య భద్రత తదితర సౌకర్యాల కోసం నిరంతరం పోరాడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Related posts

గరిటె పట్టిన పంజాబ్ సీఎం.. ఒలింపిక్ వీరులకు వండి వడ్డించిన ముఖ్యమంత్రి!

Drukpadam

బాసర ట్రిపుల్ ఐటీలో.. ఎగ్‌ఫ్రైడ్ రైస్ తిని 100 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత!

Drukpadam

పగబట్టిన కాకి.. గుర్తించి కొందరిపైనే దాడి!

Drukpadam

Leave a Comment