గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు నిందితులు మేజర్లు!… తేల్చి చెప్పిన జువెనైల్ జస్టిస్ బోర్డు!
- అమ్నీషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసులో ఐదుగురు మైనర్లు
- వీరిని మేజర్లుగా గుర్తించాలంటూ హైదరాబాద్ పోలీసుల పిటిషన్
- పోలీసులకు అనుకూలంగా తీర్పు చెప్పిన జువెనైల్ జస్టిస్ బోర్డు
- బహదూర్‌పురా ఎమ్మెల్యే కుమారుడు మైనరేనన్న బోర్డు
హైదరాబాద్‌లో కలకలం రేపిన అమ్నీషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసులో శుక్రవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఐదుగురు మైనర్ నిందితుల్లో నలుగురిని మేజర్లుగా పరిగణిస్తూ జువెనైల్ జస్టిస్ బోర్డు తన నిర్ణయాన్ని వెలువరించింది. ఈ కేసులో మొత్తం నిందితులు ఆరుగురు కాగా… వారిలో ఐదుగురు మైనర్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఐదుగురు మైనర్లలో బహదూర్‌పురా ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నారు. అయితే నలుగురు మైనర్లను మేజర్లుగా గుర్తించిన బోర్డు… ఎమ్మెల్యే కుమారుడిని మాత్రం మైనర్‌గానే పేర్కొంది.
రేప్‌కు పాల్పడ్డ వారు మైనర్లు ఎలా అవుతారు?.. మైనర్లు అయితే అత్యాచారం చేసినా శిక్షించలేమా?.. అంటూ హైదరాబాద్ పోలీసులు ఇటీవలే జువెనైల్ జస్టిస్ బోర్డులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ వీరిని మేజర్లుగా గుర్తించాలని బోర్డును కోరారు. అత్యాచారం సమయంలో బాధితురాలి పట్ల మైనర్లు వ్యవహరించిన తీరును బోర్డుకు వివరించారు. ఈ పిటిషన్‌పై విచారణను ముగించిన జువెనైల్ జస్టిస్ బోర్డు శుక్రవారం కీలక తీర్పు చెప్పింది. రేప్‌కు పాల్పడ్డ నలుగురు మైనర్లను మేజర్లుగా గుర్తించి కోర్టులో విచారణను మొదలుపెట్టాలని పోలీసులను బోర్డు ఆదేశించింది. మైనర్ అయిన ఎమ్మెల్యే కుమారుడిని జువెనైల్‌గా పరిగణిస్తూ విచారణ చేపట్టవచ్చని తెలిపింది.