ప్రాణం పోయేంత వరకు బీజేపీతో కలవను: నితీశ్ కుమార్
- వాజ్ పేయి, అద్వానీల హయాం నాటి బీజేపీ ఇప్పుడు లేదన్న నితీశ్
- బీజేపీ నాయకత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విమర్శ
- ప్రత్యర్థులపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపాటు
ప్రాణం పోయేంత వరకు బీజేపీతో మళ్లీ కలవనని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని… వారిని వేధించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటుందని చెప్పారు. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ పై కేసు పెట్టారని… దాంతో లాలూతో తనకు సంబంధాలు తెగిపోయాయని… ఇప్పుడు తాము మళ్లీ కలిశామని, దీంతో మళ్లీ కేసులు పెడుతున్నారని విమర్శించారు.
ప్రస్తుత బీజేపీ నాయకత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని అన్నారు. వాజ్ పేయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషి హయాం నాటి బీజేపీ ఇప్పుడు లేదని చెప్పారు. అందుకే తాను బీజేపీతో మళ్లీ కలవబోనని చెపుతున్నానని అన్నారు. బీహార్ లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహా ఘట్ బంధన్ ఎప్పటికీ కలిసే ఉంటుందని చెప్పారు.