Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రొఫెస‌ర్ సాయిబాబాకు షాక్‌… బాంబే హైకోర్టు తీర్పును ర‌ద్దు చేసిన సుప్రీంకోర్టు

ప్రొఫెస‌ర్ సాయిబాబాకు షాక్‌… బాంబే హైకోర్టు తీర్పును ర‌ద్దు చేసిన సుప్రీంకోర్టు

  • మావోయిస్టులతో సంబంధాల కేసులో జీవిత ఖైదు అనుభ‌విస్తున్న సాయిబాబా
  • సెష‌న్స్ కోర్టు తీర్పును ‌బాంబే హైకోర్టులో స‌వాల్ చేసిన సాయిబాబా
  • సాయిబాబా త‌దిత‌రుల‌ను నిర్దోషులుగా ప్ర‌క‌టించిన బాంబే హైకోర్టు
  • బాంబే హైకోర్టు తీర్పును స‌వాల్ చేసిన మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం
  • సాయిబాబా విడుద‌ల‌పై స్టే విధించిన సుప్రీంకోర్టు 

నిషేధిత మావోయిస్టుల‌తో సంబంధాలున్నాయ‌న్న ఆరోప‌ణ‌ల‌తో జీవిత ఖైదు అనుభ‌విస్తున్న ఢిల్లీ యూనివ‌ర్సిటీ మాజీ ప్రొఫెస‌ర్ సాయిబాబాకు సర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టులో గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. సాయిబాబా స‌హా ఈ కేసులో జీవిత ఖైదు అనుభ‌విస్తున్న మ‌రో ఐదుగురిని నిర్దోషులుగా ప్ర‌క‌టిస్తూ బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ ఇచ్చిన తీర్పును శ‌నివారం సుప్రీంకోర్టు ర‌ద్దు చేసింది. అంతేకాకుండా ప్ర‌స్తుతం నాగ్‌పూర్ జైల్లో జీవిత ఖైదు అనుభ‌విస్తున్న సాయిబాబా, మరో ఐదుగురి విడుద‌ల‌పైనా సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇక త‌న వైక‌ల్యాన్ని దృష్టిలో ఉంచుకుని అయినా త‌న‌ను త‌న నివాసంలో గృహ నిర్బంధంలో ఉంచాల‌న్న సాయిబాబా అభ్య‌ర్థ‌న‌కు కూడా సుప్రీంకోర్టు నిరాక‌రించింది.

మావోయిస్టుల‌తో సంబంధాలు నెర‌పుతూ దేశంపై యుద్ధం కొన‌సాగిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై ప్రొఫెస‌ర్ సాయిబాబా స‌హా మ‌రో ఐదుగురిని 2014లో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్ర‌మంలో జ‌రిగిన విచార‌ణ‌లో నిందితుల‌ను దోషులుగా తేల్చిన సెష‌న్స్‌ కోర్టు వారికి జీవిత ఖైదును విధించింది. దీంతో సాయిబాబా త‌దిత‌రుల‌ను పోలీసులు నాగ్‌పూర్ జైలుకు త‌ర‌లించారు. ఈ కేసు విష‌యంలో అప్ప‌టిదాకా ఢిల్లీ వ‌ర్సిటీలో ప్రొఫెస‌ర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్న సాయిబాబాను వ‌ర్సిటీ ఉన్న‌తాధికారులు స‌స్పెండ్ చేశారు. కేసులో దోషిగా తేలిన ఆయ‌న‌ను గ‌తేడాదే పూర్తిగా స‌ర్వీసు నుంచి తొల‌గించారు.

త‌మ‌ను దోషులుగా తేలుస్తూ సెష‌న్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సాయిబాబా త‌దిత‌రులు బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్‌లో స‌వాల్ చేశారు. ఈ పిటిష‌న్ల‌పైనా సుదీర్ఘ విచార‌ణ జ‌ర‌గ‌గా… సాయిబాబా త‌దిత‌రులు నిర్దోషులంటూ శుక్ర‌వారం నాగ్‌పూర్ బెంచ్ సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం స‌వాల్ చేయ‌గా… శనివారం అయినా ఈ పిటిష‌న్‌ను ప్ర‌త్యేక పిటిష‌న్‌గా ప‌రిగ‌ణించిన సుప్రీంకోర్టు నేడు విచార‌ణ చేప‌ట్టింది.

విచార‌ణ‌లో భాగంగా మ‌హారాష్ట్ర వాద‌న‌తో ఏకీభ‌వించిన జ‌స్టిస్ ఎంఆర్ షా, జ‌స్టిస్ బేలా త్రివేదీల‌తో కూడిన ధ‌ర్మాస‌నం… నాగ్‌పూర్ బెంచ్ తీర్పును ర‌ద్దు చేసింది. మ‌హారాష్ట్ర పిటిష‌న్‌పై స్పంద‌న తెలియ‌జేయాలంటూ సాయిబాబా త‌దిత‌రుల‌కు కోర్టు 4 వారాల స‌మ‌యం ఇచ్చింది. ఈ పిటిష‌న్‌పై త‌దుప‌రి విచార‌ణ‌ను డిసెంబ‌ర్ 8కి వాయిదా వేసింది.

Related posts

అసాధారణ స్థాయిలో పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక!

Drukpadam

నేనున్నానని …మీకేం కాదని…! చీమలపాడు భాదితులకు పొంగులేటి భరోసా!

Drukpadam

భారతీయుల నెట్ వాడకం పెరుగుతోందట.. ఎంత వాడుతున్నారంటే..!

Drukpadam

Leave a Comment