Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలురాజకీయ వార్తలు

గంగూలీని తొక్కేస్తున్నారు… మీరు జోక్యం చేసుకోండి: ప్రధాని మోదీకి మమతా బెనర్జీ విజ్ఞప్తి..

గంగూలీని తొక్కేస్తున్నారు… మీరు జోక్యం చేసుకోండి: ప్రధాని మోదీకి మమతా బెనర్జీ విజ్ఞప్తి..

  • బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీవిరమణ చేయనున్న గంగూలీ
  • మరోసారి అధ్యక్షుడిగా కొనసాగాలని భావించిన దాదా
  • బోర్డులోని ఇతర సభ్యుల నుంచి వ్యతిరేకత
  • సొంత రాష్ట్రం క్రికెట్ వ్యవహారాలకు మరలిన బెంగాల్ టైగర్
  • తనను ఆవేదనకు గురిచేసిందన్న మమతా బెనర్జీ

క్రికెట్ లో దాదా అనగానే వినిపించే పేరు బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీది ..తన ఆటతీరుతోనే కాకుండా క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించి అనూహ్య విజయాలు సాధించిన ఆయనను తొక్కేస్తున్నారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ జోక్యం చేసుకోవాలని సీఎం కోరారు .

రెండో పర్యాయం బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగాలని భావించిన సౌరవ్ గంగూలీకి బోర్డులో వ్యతిరేకత ప్రతికూలంగా మారిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అటు, ఐసీసీ చైర్మన్ గా వెళ్లేందుకు అవసరమైన మద్దతు కూడా గంగూలీకి లభించడంలేదని ప్రచారం జరుగుతోంది. దాంతో గంగూలీ చివరికి తన సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ క్రికెట్ సంఘం కార్యకలాపాలు చూసుకోవాలని నిర్ణయించుకున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

దీనిపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. సౌరవ్ గంగూలీ అణచివేతకు గురవుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగూలీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ గా పంపాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.

“ఏం తప్పు చేశాడని గంగూలీని తొక్కేస్తున్నారు? ఈ పరిణామాల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. గంగూలీ పరిస్థితి పట్ల దిగ్భ్రాంతికి కూడా గురయ్యాను. సౌరవ్ ఎంతో ప్రజాదరణ ఉన్న వ్యక్తి. భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించినవాడు. భారత క్రికెట్ కు ఎంతగానో సేవలందించాడు. అతడు బెంగాల్ కు మాత్రమే కాదు, భారతదేశానికే గర్వకారణం. ఎందుకు అతడిని ఇంత అమర్యాదకర రీతిలో సాగనంపుతున్నారు?” అంటూ మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు.

కోల్ కతా ఎయిర్ పోర్టులో విలేకరులతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. సౌరవ్ గంగూలీ విషయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని, ఐసీసీ పదవి కోసం పోటీపడేందుకు గంగూలీకి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ త్వరలోనే పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ బోర్డు పాలనా పగ్గాలు అందుకోనున్నారు. గంగూలీ వరుసగా రెండో పర్యాయం కూడా అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు మార్గం సుగమం చేసినా, బోర్డులోని ఇతర సభ్యుల నుంచి మద్దతు లేకపోవడంతో ఆ అవకాశం చేజారింది.

Related posts

నందిగామలో చంద్రబాబు రోడ్ షోపై రాయి విసిరిన వ్యక్తి… చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కు గాయాలు!

Drukpadam

ఒక్క రాజగోపాల్ రెడ్డిని ఎదుర్కోవడానికి ఇంతమందా …!బండి సంజయ్

Drukpadam

భారత్ క్రికెట్ లో రోహిత్, కోహ్లీ మధ్య విభేదాలు?

Drukpadam

Leave a Comment