అమరావతిపై ఏపీ ప్రభుత్వం ఎస్ఎల్ పీ.. నంబర్ కేటాయించిన రిజిస్ట్రీ!
- ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ కు నంబర్ కేటాయించిన రిజిస్ట్రీ
- చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణలో చేర్చాలని కోరిన న్యాయవాదులు
- నేడు లేదంటే రేపు విచారణకు అవకాశం కల్పించాలని వినతి
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ, ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్ పీ)కు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నంబర్ కేటాయించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారించే కేసుల జాబితాలో దీన్ని కూడా చేర్చాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరారు. వీలైతే ఈ రోజు లేదంటే రేపు (శుక్రవారం) విచారణకు అవకాశం కల్పించాలని అభ్యర్థించారు.
అమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు దాఖలు చేసిన ఎస్ ఎల్ పీపై విచారణ విషయంలో తమ వాదనలను కూడా వినాలని కోరుతూ అమరావతి రైతులు ఇప్పటికే కేవియట్ పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో సుప్రీంకోర్టు విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నెల క్రితమే ఏపీ సర్కారు ఎస్ఎల్ పీ దాఖలు చేయడం గమనార్హం.