యూపీలో ఘోరం.. ప్లేట్ లెట్ల పేరుతో పళ్లరసం ఎక్కించిన వైద్యులు.. ఆరోగ్యం విషమించి రోగి మృతి!
- ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో దారుణం
- విచారణకు ఆదేశించిన యూపీ ఉపముఖ్యమంత్రి
- తమ తప్పేమీలేదంటూ ఆసుపత్రి వైద్యుల వివరణ
డెంగ్యూతో బాధపడుతున్న ఓ రోగికి ప్లేట్ లెట్ ల పేరుతో వైద్యులు పళ్లరసం ఎక్కించారు.. దీంతో పరిస్థితి విషమించి ఆ రోగి ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగిందీ దారుణం. రోగి బంధువులు ఆందోళన చేయడంతో అధికారులు స్పందించి సదరు ఆసుపత్రికి సీల్ వేశారు.
పోలీసులు, రోగి బంధువుల కథనం ప్రకారం.. జ్వరంతో బాధపడుతున్న 32 ఏళ్ల యువకుడిని బంధువులు ప్రయాగ్ రాజ్ లోని గ్లోబల్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం ఆ యువకుడు డెంగ్యూతో బాధపడుతున్నాడని వైద్యులు తేల్చారు. రక్తంలో ప్లేట్ లెట్ ల స్థాయులు పడిపోతుండడంతో ప్లాస్మా ఎక్కించాలని నిర్ణయించారు. అదే విషయం రోగి బంధువులకు చెప్పి అవసరమైన ఏర్పాట్లు చేశారు.
ఈ క్రమంలో ఐదు యూనిట్ల ప్లాస్మా తెప్పించి రోగికి ఎక్కించడం మొదలుపెట్టారు. ఇంతలోనే రోగి పరిస్థితి మరింత క్షీణించింది. దీంతో రోగిని బంధువులు మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికే యువకుడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. అంతేకాదు, ప్లాస్మా పేరుతో పళ్లరసం ఎక్కించడం వల్లే రోగి ప్రాణాలు కోల్పోయాడని వివరించారు. దీంతో గ్లోబల్ ఆసుపత్రికి వెళ్లి రోగి బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యులను నిలదీస్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
చికిత్సలో నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ బంధువు ప్రాణాలు పోవడానికి కారణమైన గ్లోబల్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలపై యూపీ ఉపముఖ్యమంత్రి బ్రజేష్ పాథక్ స్పందించారు. ప్రాథమిక దర్యాప్తులో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలడంతో ఆసుపత్రిని సీజ్ చేయాలని ఆదేశించారు. ప్లాస్మా ప్యాకెట్లను పరీక్ష కోసం పంపించి పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని వైద్యాధికారులను ఆదేశించారు.
తమ తప్పేమీ లేదన్న ఆసుపత్రి వర్గాలు
డెంగ్యూ బాధితుడి మరణంలో తమ తప్పేమీలేదని ఆసుపత్రి వర్గాలు తేల్చిచెప్పాయి. రోగికి ప్లేట్ లెట్ లు ఎక్కించాల్సిన అవసరం నిజమేనని, ప్లాస్మా ఎక్కించిన మాటా వాస్తవమేనని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. అయితే, ప్లాస్మాను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రోగి బంధువులే తీసుకొచ్చారని వివరణ ఇచ్చింది. మూడు యూనిట్ల ప్లాస్మా ఎక్కించగానే రోగి ఆరోగ్యం క్షీణించడంతో ఆపేశామని పేర్కొంది. ఈ ఘటనలో తమ వైద్యుల తప్పేమీలేదని, విచారణకు ప్రభుత్వానికి సహకరిస్తామని ఓ ప్రకటనలో వెల్లడించింది.