నా రాజీనామాతోనే మునుగోడుకు ప్రభుత్వం కదిలి వచ్చింది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి!
- మునుగోడులో ఉప ఎన్నికలు
- బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- మునుగోడు అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని వెల్లడి
- మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని అమ్ముకోనని ఉద్ఘాటన
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రాజీనామాతోనే మునుగోడుకు ప్రభుత్వం కదిలి వచ్చిందని అన్నారు.
తానెప్పుడూ మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని అమ్ముకోనని స్పష్టం చేశారు. మునుగోడు ప్రజల అభివృద్ధే తన ధ్యేయమని పేర్కొన్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం చేతకాకే మంత్రి జగదీశ్వర్ రెడ్డి తనపై విమర్శలు చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. మునుగోడు అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఉద్ఘాటించారు.
అంతకుముందు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ధ్వజమెత్తారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరఫున ప్రచారంలో పాల్గొనేందుకు తలసాని నేడు నియోజకవర్గానికి వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రూ.18 వేల కోట్ల విలువైన కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని ఆరోపించారు. ఇవాళ మునుగోడులో ఉప ఎన్నికలు జరుగుతున్నాయంటే అందుకు కారణం ఓ వ్యక్తి స్వార్థమేనని అన్నారు.
ఓట్లేసి గెలిపించిన మునుగోడు ప్రజలకు రాజగోపాల్ రెడ్డి ఏంచేశారో చెప్పాలని నిలదీశారు. నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోకుండా, కాంట్రాక్టుల కోసమే రాజకీయాలు చేశారని తలసాని విమర్శించారు.