Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీని బతికించేందుకు అన్ని చర్యలు: మంత్రి పువ్వాడ

•- ఆర్టీసీని బతికించాలన్నదే సీఎం కేసీఆర్‌ తపన

••- రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్

•- ఎన్నికల కోడ్‌ వల్లే పీఆర్‌సీ ఆలస్యం

•- ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులకు 100 కోట్లు మంజూరు

•- త్వరలో మూడు డీఏలతో పాటు పాత బకాయిల చెల్లింపు

•- సకల జనుల సమ్మె జీతాలకు 25 కోట్లు కేటాయింపు

టీఎస్‌ ఆర్టీసీని బతికించాలన్నదే సీఎం కేసీఆర్‌ తపన అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తేల్చి చెప్పారు. తెలంగాణ మినహా మరే రాష్ట్రంలోనూ స్థానిక ప్రభుత్వాలు ఆర్టీసీలను ఆదుకోవడం లేదని, తెలంగాణలో మాత్రమే ఆర్టీసీకి ప్రభుత్వం అండగా ఉన్నదని మంత్రి తెలిపారు.

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసి ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు.

కార్పొరేషన్లు ప్రైవేటుకు విక్రయిస్తే రూ.2 వేల కోట్ల వరకు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ రాష్ట్రంలోని 49 వేల మంది ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబాల శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. ఆర్టీసీకి అన్నివిధాలా సీఎం కేసిఆర్ అండగా నిలుస్తున్నారన్నారు.

ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 5 డీఏల్లో మూడింటిని, పాత డీఏ బకాయిలను ఇవ్వనున్నట్టు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటించారు. ఇందుకోసం మొత్తంగా రూ.35 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. ఆర్టీసీ కార్మికుల ఇతర డిమాండ్ల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు దీపావళి పండుగ కానుకగా ఇప్పటికే మంజూరు చేసినట్లు మంత్రి వివరించారు.

నష్టాల నుంచి టీఎస్‌ ఆర్టీసీ క్రమంగా కోలుకొంటున్నందున ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై ఇటీవల సీఎం కేసీఆర్‌తో చర్చించామన్నారు. సీఎం కేసీఆర్‌ మానవీయకోణంలో ఆలోచించి రాష్ట్ర బడ్జెట్‌ నుంచి టీఎస్‌ ఆర్టీసీకి ఏటా రూ.1,500 కోట్లు కేటాయిస్తున్నారని, ఇలా ప్రభుత్వం నుంచి రోజుకు రూ.4 కోట్ల మేర సాయం అందుతున్నదని తెలిపారు. దీనితోపాటు ప్రస్తుతం టీఎస్‌ ఆర్టీసీకి రోజువారీగా రూ.14-15 కోట్ల ఆదాయం వస్తున్నదని, అయినప్పటికీ సంస్థకు రోజూ రూ.4-5 కోట్ల నష్టం తప్పడంలేదని చెప్పారు.

పీఆర్సీని ప్రకటించేందుకు మునుగోడు ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా ఉన్నదని దీనిపై అనుమతి కోరుతూ ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఆర్టీసీ అధికారులు లేఖ రాసినట్టు మంత్రి వెల్లడించారు. 2020 నాటికి మెచ్యూర్‌ అయిన బాండ్లపై కార్మికులకు వడ్డీ చెల్లించే అంశం కూడా పరిశీలనలో ఉన్నదని, సీఎస్‌, పీఎఫ్‌ సహా అన్ని బకాయిల చెల్లింపు అంశాన్ని త్వరలో పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

నవంబర్‌ చివరి నాటికి 1,150 కొత్త బస్సులను అందుబాటులోకి తేనున్నామని, వీటిలో 360 ఎలక్ట్రిక్‌ బస్సులు ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలో కొన్ని డిపోలను మూసివేయనున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.

Related posts

చైనా రహస్య అణు స్థావరాన్ని గుర్తించిన అమెరికా పరిశోధకుడు!

Drukpadam

లండన్‌లో మరో భారత సంతతి వ్యక్తి హత్య!

Drukpadam

ఎల్‌ఐసీలో వారానికి ఐదు రోజులే పనిదినాలు…

Drukpadam

Leave a Comment