మోదీ, అమిత్ షా అహంకారానికి మునుగోడు ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారు: కేటీఆర్
-మునుగోడులో టీఆర్ఎస్ విజయభేరి
-విజేతగా నిలిచిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
-మునుగోడు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్
-ఉప ఎన్నికను బలవంతంగా రుద్దారని విమర్శలు
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10 వేలకు పైగా మెజారిటీతో విజేతగా నిలిచారు. ఈ విజయం అనంతరం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించిన మునుగోడు ప్రజానీకానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని వెల్లడించారు. మునుగోడులో ఆత్మగౌరవానికి, అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని అన్నారు.
మునుగోడు నియోజకవర్గంలో తమతో కలిసి నడిచిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఇతర వామపక్ష నేతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని వివరించారు.
సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చిన హుజూర్ నగర్, నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ కే పట్టం కట్టారని కేటీఆర్ పేర్కొన్నారు. మునుగోడు విజయం అనంతరం నల్గొండ జిల్లాల్లో మొత్తం 12 అసెంబ్లీ స్థానాలు టీఆర్ఎస్ వశమయ్యాయని తెలిపారు. నల్గొండ ప్రజలు చరిత్ర లిఖించారని, వారికి శిరసు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు.
“రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని పెద్దలు చెబుతారు. మునుగోడు ఎన్నికల్లో జరిగింది అదే. అహంకారంతో, డబ్బు మదంతో ఢిల్లీ బాసులు నరేంద్ర మోదీ, అమిత్ షా బలవంతపు ఉప ఎన్నికను మునుగోడు ప్రజలపై రుద్దే ప్రయత్నం చేశారు. కానీ మునుగోడు ప్రజలు వాళ్లిద్దరి అహంకారానికి చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చారు. ఈ ఉప ఎన్నికను రుద్దినవారికి మునుగోడు ప్రజలు గుద్దిన గుద్దుడుతో దిమ్మదిరిగిపోయింది.
ఈ ఉప ఎన్నికలో కనిపించిన బీజేపీ ముఖం రాజగోపాల్ రెడ్డి మాత్రమే అయినా, ఆయన వెనకుండి ఆడించింది మోదీ, అమిత్ షా. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోసి, తెలంగాణలోనూ కూల్చేందుకు ప్రయత్నించారు. దీని వెనకున్నది మోదీ, అమిత్ షానే అని గుర్తించిన తెలంగాణ ప్రజలు ఓటుతో తమ చైతన్యాన్ని చాటారు.
మునుగోడులో బీజేపీ అభ్యర్థిని అడ్డదారిలోనైనా గెలిపించాలని ఢిల్లీ నుంచి వందల కోట్లు కుమ్మరించారు. మునుగోడు ఎన్నికను ధనమయం చేశారు” అంటూ కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు.
బండి సంజయ్ అనుచరుడు, కరీంనగర్ కార్పొరేటర్ భర్త చొప్పరి వేణు కోటి రూపాయాలతో దొరికిపోయాడని, ఈటల రాజేందర్ పీఏ కడారి శ్రీనివాస్ రూ.90 లక్షలతో పట్టుబడ్డాడని కేటీఆర్ వెల్లడించారు.
డాక్టర్ వివేక్ గుజరాత్ నుంచి రూ.2.5 కోట్లు హవాలా ద్వారా తెప్పించి దొరికిపోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. వివేక్ ఈ ఎన్నికల కోసం రాజగోపాల్ రెడ్డికి రూ.75 కోట్లు బదిలీ చేశారని ఆరోపించారు. జమున హేచరీస్ కు రూ.25 కోట్లు బదిలీ చేశారని వెల్లడించారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈ వివేక్ ఓ హవాలా ఆపరేటర్ మాదిరిగా వ్యవహరిస్తున్నాడని కేటీఆర్ పేర్కొన్నారు.
అంతేకాకుండా, రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి చెందిన సుషీ ఇన్ ఫ్రా సంస్థ నుంచి రూ.5 కోట్లు మునుగోడు ఓటర్లకు, మునుగోడు బీజేపీ నేతల ఖాతాల్లోకి బదిలీ చేశారని వివరించారు. వీటన్నింటిపై తాము ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే, ఢిల్లీలో ఒత్తిడి తెచ్చి ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్ర వహించేలా చేశారని కేటీఆర్ ఆరోపించారు. అయినప్పటికీ మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధికే ఓటు వేశారని ఉద్ఘాటించారు.