Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం -ప్రభుత్వ విప్ గొంగిడి సునీత!

జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం -ప్రభుత్వ విప్ గొంగిడి సునీత!
-సంక్షేమ నిధి ఏర్పాటుకు తన సహకారం: ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి
-వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి ఐజేయూ రాజీలేని పోరాటం : ఐజేయూ కార్యదర్శి నరేందర్ రెడ్డి
-జర్నలిస్టుల సమస్యల పరిష్కరానికి రాజీలేని పోరాటాలు ;రాష్ట్ర కార్యదర్శి విరహత్ అలీ
-అందుకే దేశంలో నంబర్ వన్ యూనియన్ గా టీయూడబ్ల్యూ జే

ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడుతున్న మీడియా ఆరోగ్యంగా ఉంటేనే సమాజంలో మిగితా వ్యవస్థలు స్పృహతో పనిచేస్తాయని, ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత అన్నారు. మీడియాలో రాత్రి పగలు శ్రమించే జర్నలిస్టుల సంక్షేమానికి తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఆదివారం నాడు భువనగిరి పట్టణంలోని ఎస్.ఎల్.ఎన్.ఎస్ గార్డెన్స్ (డాక్టర్ తిరునగిరి ప్రాంగణం)లో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) యాదాద్రి భువనగిరి జిల్లా ద్వితీయ మహాసభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో
కీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న టీయూడబ్ల్యూజే శాఖను ఆమె అభినందించారు. దేశ స్థాయిలో వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమానికి నల్లగొండ జిల్లా ముద్దుబిడ్డ కే.శ్రీనివాస్ రెడ్డి నాయకత్వం వహించడం తమకు గర్వంగా ఉందన్నారు.

విశిష్ట అతిథిగా హాజరైన భువనగిరి శాసన సభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, తమ కర్తవ్యాన్ని అంకితాభావంతో, నిజాయితీగా నిర్వహిస్తున్న జర్నలిస్టుల జీవనస్థితి దయనీయంగా ఉందని ఆయన విచారం వ్యక్తం చేశారు. సమాజ హితాన్ని కాంక్షిస్తూ, పవిత్రమైన జర్నలిజం వృత్తిని కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టులకు ఎల్లవేళలా తన సహకారం ఉంటుందని శేఖర్ రెడ్డి భరోసానిచ్చారు. జిల్లాలో ఆపదలో వుండే జర్నలిస్టులను ఆదుకోడానికి సంక్షేమ నిధి ఏర్పాటుకు టీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ చర్యలు చేపట్టాలని, ఇందుకు తనవంతు సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

ఐజేయూ జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఏపీయూడబ్ల్యూజే సంఘం, తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఆవిర్భవించిన టీయూడబ్ల్యూజే సంఘం దేశంలోనే అతిపెద్ద సంఘాలుగా గుర్తింపు పొందడం గర్వించదగిన విషయమన్నారు. దేశంలో వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి ఐజేయూ రాజీలేని పోరాటాలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టుల ప్రధాన సమస్యలైన ఆరోగ్య భద్రతా, ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తూ దేశ స్థాయిలో టీయూడబ్ల్యూజే అగ్రస్థానంలో నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. నిరంతర రాజీలేని పోరాటాలతోనే అది సాధ్యమైందని ఆయన అన్నారు. జర్నలిస్టుల కన్నీటి కష్టాలపై పాలకుల కళ్ళు తెరిపించడానికి మరెన్నో పోరాటాలు చేయకతప్పదని విరాహత్ స్పష్టం చేశారు.

తెలంగాణ చిన్న, మధ్యతరహా పత్రికలు, మేగజైన్స్ అసోసియేషన్ అధ్యక్షులు యూసుఫ్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం చిన్న పత్రికల పట్ల వివక్షత చూపితే సహించేది లేదన్నారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకు దశల వారిగా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంకా ఈ సభలో శాసన మండలి సభ్యులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, జెడ్పి ఛైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కే.అనీల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, జిల్లా పౌరసంబంధాల శాఖాధికారి వెంకటేశ్వర్ రావు, ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎలిమినేటి ఇంద్రారెడ్డి, టీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి ఎలిమినేటి జహంగీర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మరాఠీ రవి తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Related posts

నేడు టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవం..

Drukpadam

టీఎన్ఆర్ కుటుంబానికి మెగాస్టార్ రూ. లక్ష సాయం

Drukpadam

మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన పొంగులేటి.. తొలి సంతకం దేనిపై పెట్టారంటే..!

Ram Narayana

Leave a Comment