Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీ పెద్దల ఆదేశాలతోనే ఐటీ దాడులు.. మర్రి రాజశేఖర్ రెడ్డి ఆరోపణలు!

ఢిల్లీ పెద్దల ఆదేశాలతోనే ఐటీ దాడులు.. మర్రి రాజశేఖర్ రెడ్డి ఆరోపణలు!

  • అధికారుల సోదాల సమయంలో టర్కీలో ఉన్నానన్న రాజశేఖర్ 
  • దాడుల విషయం మీడియా ద్వారానే తెలిసిందని వివరణ
  • 4 కోట్లు దొరకడం పెద్ద విషయం కాదన్న మల్లారెడ్డి అల్లుడు
  • తన ఇంట్లో డిజిటల్ లాకర్లు ఎందుకు ఉంటాయని ప్రశ్న

తమ ఇళ్లు, ఆఫీసులు, విద్యా సంస్థలపై ఐటీ దాడులను మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి తప్పుబట్టారు. దాడులు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నవేనని ఆరోపించారు. ఐటీ అధికారులు సోదాలకు వచ్చినపుడు తాను టర్కీలో ఉన్నానని ఆయన తెలిపారు. తన కుటుంబ సభ్యులు, విద్యాసంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగుల ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఐటీ దాడుల విషయం తనకెవరూ చెప్పలేదని, మీడియా ద్వారానే తెలుసుకున్నానని వివరించారు. టర్కీ నుంచి గురువారం ఉదయమే హైదరాబాద్ కు వచ్చానని ఆయన వెల్లడించారు.

ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకే తమపై ఐటీ దాడులు జరిగాయని భావిస్తున్నట్లు మర్రి రాజశేఖర్ రెడ్డి చెప్పారు. తమ కుటుంబం పార్టీ మారాలన్నదే ఈ దాడుల మోటివ్ అని అనుకుంటున్నట్లు వివరించారు. సోదాల సందర్భంగా ఐటీ అధికారులు అమానుషంగా ప్రవర్తించారని ఆయన మండిపడ్డారు. 75 ఏళ్లు పైబడిన తన తండ్రిని పగలూ రాత్రీ తేడాలేకుండా ఇంటికి బయటకూ తిప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ ఇంట్లో రెండు డిజిటల్ లాకర్లను స్వాధీనం చేసుకున్నట్లు మీడియా వార్తల్లో చూశానని చెప్పిన రాజశేఖర్ రెడ్డి.. తనది సాధారణమైన ఇల్లు అని, తన ఇంట్లో డిజిటల్ లాకర్లు ఎందుకు ఉంటాయని ఎదురు ప్రశ్నించారు. నాలుగు కోట్ల నగదు దొరికిందన్న వార్తలపై స్పందిస్తూ.. తన ఆధ్వర్యంలో ఐదు విద్యాసంస్థలు నడుస్తున్నాయని మర్రి రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఒక్కో విద్యాసంస్థలో సిబ్బందికి ఇచ్చే వేతనాల ఖర్చే రూ.2 కోట్లు ఉంటుందని వివరించారు. ఐదు విద్యాసంస్థలలో మొత్తం రూ.10 కోట్లు నెలనెలా జీతాలు చెల్లిస్తామని రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. అలాంటిది 4 కోట్లు దొరకడం పెద్ద విషయం కాదని తేల్చిచెప్పారు.

Related posts

వివిధరంగాలలో సేవలందించినవారికి అవార్డులు ఇవ్వడం గర్వకారణం:ఏపీ సీఎం జగన్!

Drukpadam

ముగిసిన రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్‌… 21న ఓట్ల లెక్కింపు!

Drukpadam

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో ముగిసిన సీఎం జగన్ భేటీ!

Drukpadam

Leave a Comment