నాకు, జగ్గారెడ్డికి మధ్య ఉన్నది తోడికోడళ్ల పంచాయితీనే: రేవంత్ రెడ్డి!
- అసెంబ్లీ ఆవరణలో కలిసిన రేవంత్, జగ్గారెడ్డి
- నవ్వుతూ కరచాలనం… ఫొటోలకు పోజులు
- తాము తోడికోడళ్ల లాంటి వాళ్లమన్న రేవంత్
- ఎన్నో అనుకుంటామని, ఆపై కలిసిపోతామని వెల్లడి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మధ్య కొంతకాలంగా ఎడం పెరిగిన సంగతి తెలిసిందే. అయితే నేడు అసెంబ్లీ ఆవరణలో ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తమ మధ్య జరిగేది పట్టించుకోవాల్సిన అవసరంలేదని, తమది తోడికోడళ్ల పంచాయితీ అని చమత్కరించారు. ఒక ఇంట్లో ఉండే తోడికోడళ్లు ఎన్నో అనుకుంటారు, ఆ తర్వాత కలిసిపోతారు… తాము కూడా అంతేనని రేవంత్ రెడ్డి అన్నారు.
అయితే మీడియా ఓ అడుగు ముందుకేసి మీలో పెద్దకోడలు ఎవరని ప్రశ్నించగా, ఇప్పుడు కలిశామో లేదో అప్పుడే తామిద్దరి మధ్య దూరం పెంచేందుకు ప్రయత్నిస్తోందంటూ మీడియాపై రేవంత్ ఛలోక్తి విసిరారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి స్పందిస్తూ, తాను రేవంత్ గురించి చెప్పాలనుకున్నది చెప్పేశానని స్పష్టం చేశారు. ముందొక మాట వెనుక ఒక మాట మాట్లాడే అలవాటు తనకు లేదని, అసెంబ్లీ ఎన్నికల వరకు ఇక రేవంత్ రెడ్డి గురించి మాట్లాడబోనని చెప్పారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు తన మద్దతు ఉంటుందని వెల్లడించారు. ఎన్ని అనుకున్నా తాము కలిసుంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి, రేవంత్ నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు.