5జీ గొప్ప కాదు… మాతాజీ, పితాజీనే గొప్ప: ముఖేశ్ అంబానీ!
- యూనివర్శిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ముఖేశ్
- తల్లిదండ్రుల గొప్పదనం గురించి మాట్లాడిన వైనం
- తల్లిదండ్రుల త్యాగాలను, శ్రమను మర్చిపోవద్దన్న అంబానీ
ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మానాన్నలే అత్యంత ముఖ్యమని రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ అన్నారు. మాతాజీ, పితాజీ కంటే 5జీ ఏమాత్రం గొప్పది కాదని చెప్పారు. గుజరాత్ లోని పండిట్ దీన్ దయాళ్ ఎనర్జీ యూనివర్శిటీ స్నాతకోత్సవం కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది మీ రోజని, మీరేంటో ప్రపంచానికి తెలిసే రోజని… అయినప్పటికీ మీరు నిల్చున్నది మీ తల్లిదండ్రుల రెక్కలపైనే అని చెప్పారు.
మీ తల్లిదండ్రులకు కూడా ఈరోజు ప్రత్యేకమైనదని అన్నారు. మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకురావడానికి మీ తల్లిదండ్రులు చేసిన త్యాగాలను, వారు పడిన శ్రమను మర్చిపోవద్దని చెప్పారు. మీకు వాళ్లు ఎప్పుడూ అండగా ఉంటారని… మీ బలానికి మూలస్తంభాలు వారేనని అన్నారు. ప్రస్తుత యువత 4జీ, 5జీ గురించి ఉత్సాహంగా ఉన్నారని… కానీ, మాతాజీ, పితాజీల కంటే ఏ జీ గొప్పది కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు.
మన దేశ అభివృద్ధిలో యువత పాత్ర చాలా కీలకమని అన్నారు. యువత ఆలోచనలు, వారి ఆవిష్కరణలతో మన దేశ ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి 3 లక్షల కోట్ల డాలర్ల నుంచి 40 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందనే నమ్మకం తనకు ఉందని చెప్పారు.