ఉన్న పళంగా రూ. 80 లక్షల బోనస్ ప్రకటించిన లేడీ బాస్.. షాక్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్న ఉద్యోగులు!
- ఆస్ట్రేలియాలో మైనింగ్ మొఘల్‌గా పేరుగాంచిన రెన్‌హార్ట్
- పది మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి లక్ష అమెరికన్ డాలర్ల చొప్పున క్రిస్మస్ బోనస్
- మూడు నెలల క్రితం కంపెనీలో చేరిన ఉద్యోగికి కూడా..
ట్విట్టర్ మొదలు అమెజాన్ వరకు టెక్ కంపెనీలన్నీ ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటిస్తూ ఇంటికి పంపిస్తుంటే ఓ కంపెనీ అధినేత్రి మాత్రం ఉద్యోగులను చెప్పలేని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఒక్కొక్కరి పేరు చదువుతుంటే వారి గుండెలు ఆగిపోయినంత పనైంది. తమ ఉద్యోగాలు ఊడిపోయినట్టేనని ఊహించుకుని భయపడ్డారు. కానీ చివర్లో ఆమె చేసిన ప్రకటన నుంచి వారు ఇంకా తేరుకోలేకపోతున్నారు. ఒక్కొక్కరికి లక్ష డాలర్ల చొప్పున బోనస్ ప్రకటిస్తూ ఆమె చేసిన ప్రకటన ఉద్యోగులను ఉద్వేగానికి గురిచేసింది.
ఆస్ట్రేలియాలో హాన్‌కాక్ ప్రాస్పెక్టింగ్ అనే మైనింగ్, అగ్రికల్చరల్ కంపెనీకి జార్జినా (గినా) రెన్‌హార్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, డైరెక్టర్‌గా ఉన్నారు. మైనింగ్ మొఘల్‌గా పేరుగాంచిన ఆమె 34 బిలియన్ డాలర్ల సంపదతో ఆస్ట్రేలియాలోని అత్యంత సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆమె తండ్రి స్థాపించిన హాన్‌కాక్ ప్రాస్పెక్టింగ్‌కు చెందిన రాయ్‌హిల్ అనే మరో సంస్థలోని ఉద్యోగులతో ఇటీవల ఆమె సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంస్థలోని 10 మంది ఉద్యోగుల పేర్లను చదివి వినిపించారు. ఆ పేర్లు విన్న వారు తమ ఉద్యోగాలు పోయినట్టేనని భావించారు. అయితే, ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ.. ఆ 10 మంది ఉద్యోగులకు క్రిస్మస్ బోనస్‌గా ఒక్కొక్కరికి లక్ష అమెరికన్ డాలర్ల (దాదాపు రూ. 80 లక్షలు) చొప్పున బోనస్ ఇస్తున్నట్టు ప్రకటించి వారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. బోనస్ అందుకోబోతున్న పది మందిలో మూడు నెలల క్రితమే కంపెనీలో చేరిన ఓ ఉద్యోగి కూడా ఉండడం గమనార్హం. కాగా, ఆ కంపెనీ ఏడాది కాలంలో ఏకంగా 3.3 బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జించింది.