కౌలు రైతుల విషయంలో పవన్ సలహాలకు వైసీపీ ఆహ్వానం!
-మెరుగైన విధానం ఏమైనా ఉంటే పవన్ చెప్పొచ్చున్న సజ్జల
-ఏపీలో పవన్ కౌలురైతు భరోసా యాత్ర
-కౌలు రైతులను తమ ప్రభుత్వం ఆదుకుంటోందన్న సజ్జల
-అవసరమైన సాయం అందిస్తున్నామని వెల్లడి
-ముందస్తు ఎన్నికల ప్రసక్తేలేదు
-ఏపీలో బీఆర్ యస్ పోటీచేస్తే అభ్యంతరం లేదు
-తమకు ఎవరితో పొత్తులు ,ఎత్తుల చచ్చు ఆలోచనలు లేవు
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కౌలు రైతులకు సంబంధించి ఏదైనా మెరుగైన విధానం ఉంటే పవన్ కల్యాణ్ చెప్పాలని అన్నారు. రాష్ట్రంలోని కౌలు రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వారికి అవసరమైన సాయం అందిస్తున్నామని సజ్జల తెలిపారు. ఉప్పు నిప్పులా ఉండే పవన్ వైసీపీ మధ్య సంబంధాలు కౌలు రైతులపై సజ్జల వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పైగా పవన్ కౌలు రైతుల విషయంలో మెరుగైన సలహాలు ఇస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని అర్థం వచ్చేలా మాట్లాడటంతో రాజాకీయ సమీకరణాల్లో ఏమైనా మార్పులు ఉంటాయా ?అనే సందేహాలకు ఆవకాశం కల్పించింది. పవన్ వచ్చే ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు . టీడీపీతో కలిసి వెళ్తారా ?లేదా అనేది చర్చనీయాంశంగా మారింది .
ఏపీలో ముందస్తు ఎన్నికలు అంటూ జరుగుతున్న ప్రచారంపైనా ఆయన స్పందించారు. సొంత పార్టీలో ఊపు లేకపోవడంతో చంద్రబాబు ముందస్తు ఎన్నికలు అంటున్నారని విమర్శించారు. తన పార్టీలోని కార్యకర్తల్లో ఉత్సాహం కలిగించేందుకే చంద్రబాబు ముందస్తు అంటూ మాయమాటలు చెబుతున్నారని సజ్జల పేర్కొన్నారు. పొత్తులు, ఎత్తులు వంటి చచ్చు ఆలోచనలు చేయాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు.
ఇక, కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీపై స్పందిస్తూ… ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేస్తే మంచిదేనని వ్యాఖ్యానించారు. అయితే వైసీపీ తెలంగాణలో పోటీ చేయబోదని, రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని భావించామని సజ్జల వెల్లడించారు.
వైసీపీ కర్ణాటకలో పోటీ చేస్తుందంటూ వస్తున్న కథనాలను ఖండించారు. ఇవి కేవలం ఊహాగానాలే అని, తాము ఏపీకి మాత్రమే పరిమితం అని సజ్జల తేల్చిచెప్పారు.