షర్మిల బీజేపీ వదిలిన బాణమేనా …?
–పాలేరులో పార్టీ కార్యాలయానికి భూమిపూజ
–పాల్గొన్న విజయమ్మ , ఇతరనేతలు
–సభకు వచ్చిన వారిలో ఎస్టీ లంబాడాలే అధికం
–పరిమిత సంఖ్యలో ఎస్సీ లు
–మిగతా సామజిక వర్గాలనుంచి కనిపించని ఆదరణ
షర్మిల …వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు …తెలంగాణాలో పార్టీ పెట్టిన నాటినుంచి విరామమెరగకుండా పాదయాత్రలు చేస్తూ ప్రజలల్లో నిత్యం ఉంటున్నారు . ఇప్పటికే తెలంగాణాలో 3500 కి .మీ పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు . మొదట్లో ఆమెను, ఆమె పార్టీని పట్టించుకోని నేతలు ఇప్పుడు ఆమె కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నారు . ఇంతకూ ఆమె ఎవరు వదిలిన బాణం …బీజేపీ వదిలిందా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు …కానీ ఆమె మాత్రం తాను ఎవరు వదిలిన బాణం కాదని చెపుతున్నారు .ఆమె ఎన్ని చెప్పినప్పటికీ ప్రజల్లో అనుమానాల తొలగించలేకపోతున్నారు . ఆమె పాదయాత్ర సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అక్కడ ఎమ్మెల్యేల పనితీరుపై విరుచుకుపడుతున్నారు . ఇటివల వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు .దీంతో రెచ్చిపోయిన టీఆర్ యస్ కార్యకర్తలు ఆమె వాహనాలపై దాడులు చేశారు. దీంతో ఆమెను పోలీసులు బలవంతంగా పాదయాత్ర నుంచి హైద్రాబాద్ తరలించారు. పోలీసులు చర్యలకు నిరసనగా ఆమె రాళ్ల దాడిలో ధ్వంసం అయిన కారును తీసుకోని ,సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవనం వైపుకు వెళుతుంటే మార్గమధ్యలో నిలిపిన పోలీసులు క్రైన్ సాయంతో ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించారు . ఈ సందర్భంగా ప్రధాని మోడీ షర్మిలకు ఫోన్ చేసి ఆరాతీయడం, ఆమె రాష్ట్ర గవర్నర్ ను కలవడం సంచలనంగా మారింది . ఆమె బీజేపీ వదిలిన బాణమే అనేదానికి బలం చేకూరింది .
బీజేపీతో షర్మిలకు లాభమా ? నష్టమా ??
షర్మిల ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు ప్రకటించారు. ఆమెకు బీజేపీ మద్దతు ఉంటుందని ప్రచారం జరుగుతుంది. అది ఆమెకు లాభమా ? నష్టమా ? అనేది చర్చనీయాంశంగా మారింది. వైయస్సార్ సంక్షేమ పథకాలు ఇప్పటికి ప్రచారంలో ఉన్నమాట వాస్తవమే .అయితే దానిద్వారా కొన్ని ఓట్లు పొందగలిగినా బీజేపీ వల్ల ఉపయోగం ఉంటుందా ? అనేది ఇక్కడ సమస్య … పైగా ఖమ్మం జిల్లాలో బీజేపీ ప్రభావం పెద్దగా లేదు . కేవలం ఆమె స్వయం కృషితో ఎన్నికల్లో ప్రత్యర్థులను ఎదుర్కోవాలి .రాష్ట్రంలో తమ అభ్యర్థులు పోటీచేస్తున్న చోట పర్యటించాలి . ఇప్పటికైతే ఆమెకు నియోజకవర్గంలో యత్రాంగంలేదు . పార్టీ నిర్మాణం లేదు . ఇవన్నీ జరగాలంటే మరింత శ్రమించాలి …అందుకు సమయం కావాలి .ఒకవేళ ఆమె పోటీ చేసి ఓడిపోతే మొత్తానికే నష్టం జరుగుతుందనే అభిప్రాయాలూ ఉన్నాయి.
ఆమె శుక్రవారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పరిధిలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేయడానికి వచ్చారు . ఈ కార్యక్రమంలో వేలాదిగా తరలివస్తారని భావించినా పెద్దగా స్పందన లేకపోవడం గమనార్హం .వచినవారికో కూడా ఎస్టీలు ఎక్కువగా .ఎస్సీ లుపరిమిత సంఖ్యలో హాజరయ్యారు.మిగతా సెక్షన్స్ నుంచి పెద్దగా ఆదరణ కనిపించలేదు .రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని వైయస్ పథకాలు అమలు చేస్తామని చెప్పుతూ తిరుగుతున్నా షర్మిల సభకు ప్రజలను తరలించడంలో ఎక్కడో లోపం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె పోటీచేయబోతున్న నియోజకర్గంలో మొదటి ఇంప్రషన్ సరిగా లేకపోవడం పార్టీ కార్యకర్తలను సహితం నిరుత్సాహానికి గురిచేసినట్లు తెలుస్తుంది.