Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

టాలీవుడ్ లో మరో విషాదం.. చలపతిరావు కన్నుమూత…

టాలీవుడ్ లో మరో విషాదం.. చలపతిరావు కన్నుమూత…
-టాలీవుడ్ లో వరుస విషాదాలు
-గుండెపోటుతో చలపతిరావు మృతి
-1,200కు పైగా చిత్రాల్లో నటించిన చలపతిరావు

టాలీవుడ్ లో వరుసగా విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సీనియర్ నటుడు చలపతిరావు ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. గుండెపోటుతో మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నటనకు కూడా దూరంగానే ఉంటున్నారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. 1,200కు పైగా సినిమాలలో చలపతిరావు నటించారు.

కృష్ణా జిల్లా బల్లిపర్రులో 1944లో ఆయన జన్మించారు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి వార్తతో టాలీవుడ్ షాక్ కు గురైంది. కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిసి 24 గంటలు కూడా గడవక ముందే మరో సీనియర్ నటుడు మృతి చెందడంతో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

విదేశాల్లో ఉన్న చలపతిరావు కుమార్తెలు.. బుధవారం అంత్యక్రియలు

అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని రవిబాబు నివాసంలోనే ఉంచనున్నారు. మధ్నాహ్నం 3 గంటల తర్వాత మహాప్రస్థానంలోని ఫ్రీజర్ లో ఉంచుతారు. బుధవారంనాడు అంత్యక్రియలను నిర్వహించనున్నారు. మరోవైపు చలపతిరావు మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

చలపతిరావు జీవితంలో విషాదం.. అగ్నిప్రమాదంలో చనిపోయిన భార్య

సీనియర్ నటుడు చలపతిరావు 78 ఏళ్ల వయసులో గుండె పోటుతో మృతి చెందారు. 1966లో 22 ఏళ్లకే చలపతిరావు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆయన తొలి చిత్రం సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘గూఢచారి 116’.

భోజనం చేసి అలానే వాలిపోయారు.. నాన్న చాలా ప్రశాంతంగా వెళ్లిపోయారు: రవిబాబు

తన తండ్రి, ప్రముఖ నటుడు చలపతి రావు చాలా ప్రశాంతంగా కన్నుమూశారని నటుడు, దర్శకుడు రవిబాబు తెలిపారు. ‘నిన్న రాత్రి 8.30 గంటలకు నాన్నగారు కన్నుమూశారు. ఆయన జీవితంలో ఎలా హ్యాపీగా ఉన్నారో, అందరినీ ఎలా నవ్విస్తూ ఉండేవారో అలానే ప్రశాంతంగా వెళ్లిపోయారు. భోజనం చేసి, చికెన్ కూర, చికెన్ బిర్యాని తిన్నారు. ఆ ప్లేట్ ను ఇచ్చి వెనక్కి వాలిపోయారు. అంత సింపుల్ గా, హ్యాపీగా వెళ్లిపోయారు. ఈ రోజే అంత్యక్రియలు నిర్వహిద్దామనుకున్నాం. కానీ, మా సిస్టర్స్ అమెరికాలో ఉన్నారు. వాళ్లు రావడానికి టైం పడుతుంది. మంగళవారం మంచి రోజు కాదు కాబట్టి బుధవారం నిర్వహిస్తాం’ అని మీడియాతో చెప్పారు.

ఇండస్ట్రీలో తన తండ్రి ఎంతో మందికి సాయం చేశారని, ఆ విషయం కుటుంబంలో ఎవ్వరికీ తెలిసేది కాదన్నారు. ‘మా నాన్న గురించి నాకంటే మీ అందరికే ఎక్కువ తెలుసు. ఆయన ఎలాంటి వ్యక్తి, ఇండస్ట్రీలో ఎలా ఉంటారనే విషయం చిన్నప్పుడు నాకు తెలియదు. కానీ, నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే తెలిసింది. అందరూ ఆయన గురించి గొప్పగా చెప్పేవారు. ఎంతో మందికి సాయం చేశారని తెలిసింది.

ఈ విషయాలు మాకు తెలిసేవి కాదు. మా నాన్నకు రామారావు గారు, ఆహారం, హాస్యం ఈ మూడే చాలా ఇష్టం. ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ ఉండేవారు. అలానే ఇప్పుడు ఒక్క క్షణంలో ఎలాంటి బాధ లేకుండా ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. అలాంటి వ్యక్తికి శత్రువులు ఎవ్వరూ ఉండరు. నా కొత్త సినిమాలో ఆయన చివరగా నటించారు. ఐదు రోజుల క్రితమే షూటింగ్ లో పాల్గొన్నారు. అదే ఆయనకు చివరి చిత్రం’ అని రవిబాబు వెల్లడించారు.

రెండు రోజుల్లో ఇద్దరు గొప్ప నటులను కోల్పోవడం బాధాకరం: చంద్రబాబు, పవన్ కల్యాణ్

సీనియర్ సినీ నటుడు చలపతిరావు ఈ తెల్లవారుజామున మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమ రెండు రోజుల్లో ఇద్దరు గొప్ప నటులను కోల్పోవడం బాధాకరమని చెప్పారు. చలపతిరావు మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.

పవన్ కల్యాణ్ స్పందిస్తూ, ప్రముఖ నటులు చలపతిరావు కన్నుమూయడం బాధాకరమని చెప్పారు. ప్రతి నాయకుడి పాత్రల్లోనే కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తనదైన శైలిలో సినీ అభిమానులను మెప్పించారని తెలిపారు. నిర్మాతగా మంచి చిత్రాలను నిర్మించారని కొనియాడారు. ఒక తరానికి సినీ పరిశ్రమ ప్రతినిధులుగా ఉన్న సీనియర్ నటులు ఒక్కొక్కరుగా కాలం చేస్తుండటం దురదృష్టకరమని చెప్పారు. చలపతిరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Related posts

ఆ డైలాగ్ వినగానే జగన్ గుర్తొచ్చారు: ‘శాసనసభ’ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమంలో రోజా…

Drukpadam

థియేట‌ర్ల స‌మ‌స్య‌పై ఏపీ మంత్రుల‌తో నేను మాట్లాడ‌తాను: తెలంగాణ మంత్రి త‌ల‌సాని!

Drukpadam

చిరంజీవిని పొగడ్తలతో ముంచెత్తిన డైలాగ్ కింగ్ మోహన్ బాబు ….

Drukpadam

Leave a Comment