Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

ఇన్‌స్టాలో కీలక వ్యాఖ్యలతో సమంత పోస్ట్

  • మానసిక ప్రశాంతతపై నటి సమంత ఇన్‌స్టాలో పోస్ట్
  • ఇతరుల మాటలతో ప్రశాంతత కోల్పోవద్దని సూచన
  • సరిహద్దులు ఆత్మగౌరవంలో భాగమని వ్యాఖ్య
  • దర్శకుడు రాజ్‌ నిడిమోరుతో సమంత రిలేషన్‌షిప్‌పై ప్రచారం
  • రాజ్‌ నిడిమోరు భార్య శ్యామలి కూడా సందేశాత్మక పోస్టులు
  • నమ్మకంపై శ్యామలి ఇన్‌స్టా స్టోరీ.. చర్చనీయాంశం

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్న ఓ సందేశాత్మక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇతరుల మాటల వల్ల మానసిక ప్రశాంతతను దెబ్బతీయవద్దంటూ ఆమె తన ఇన్‌స్టా స్టోరీస్‌లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పోస్ట్ వెనుక నిర్దిష్ట కారణమేమిటో స్పష్టంగా తెలియకపోయినప్పటికీ, ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి వస్తున్న వార్తల నేపథ్యంలో ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. “ఇతరుల మాటలను పట్టించుకోకుండా నిబ్బరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఏదైనా జరగనీ అన్నట్లు ఉంటే ప్రశాంతత రాదు.. దాని కోసం నిరంతర సాధన అవసరం. ప్రశాంతతను ఆస్వాదించాలి గానీ.. దానితో పోరాడొద్దు. జరగాల్సిన దాన్ని జరగనివ్వాలి,” అంటూ సమంత తన పోస్ట్‌లో పేర్కొన్నారు. “‘నేను చేయాల్సింది’ అనే భావనను ‘నేను తప్పకుండా చేయాల్సిందే’ అనే విధంగా మార్చుకోవాలి. మనసు వేగంతో కాదు.. నిశ్చలత్వంతో ప్రశాంతంగా మారుతుంది. మనం పెట్టుకునే సరిహద్దులు ఆత్మగౌరవంలో భాగమే. అంతేగానీ.. ఒత్తిళ్లు గౌరవానికి అవరోధం కాకూడదు. మీ శక్తిని తీసుకోవడానికి ఎవరూ అర్హులు కాదు,” అని ఆమె రాసుకొచ్చారు. అకస్మాత్తుగా సమంత ఈ విధమైన తాత్విక ధోరణిలో పోస్ట్ పెట్టడం వెనుక కారణాలపై ఆమె అభిమానులు, నెటిజన్లు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

గత కొన్ని రోజులుగా సమంత వ్యక్తిగత జీవితం గురించి అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవలే వృత్తిపరమైన పనుల నిమిత్తం సమంత దుబాయ్‌కు వెళ్లారు. అక్కడ దిగిన వెకేషన్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోగా, ఆ ఫోటోలలో రాజ్ నిడిమోరు కూడా ఉన్నారంటూ పలువురు కామెంట్లు చేశారు. ఈ ప్రచారం జరుగుతున్న తరుణంలోనే సమంత ఈ పోస్ట్ చేయడం గమనార్హం. మరోవైపు, రాజ్ నిడిమోరు అర్ధాంగి శ్యామలి కూడా వరుసగా సందేశాత్మక పోస్టులు షేర్ చేస్తుండటం ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోస్తోంది. ఆమె కర్మ సిద్ధాంతం, నమ్మకం వంటి అంశాలపై ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశాలు పంచుకుంటున్నారు. “నమ్మకం అనేది అన్నిటికంటే విలువైనది. ఒకసారి దాన్ని కోల్పోతే ఎన్ని ఆస్తులు పెట్టినా తిరిగి పొందలేరు,” అనే సందేశాన్ని ఆమె ఇటీవల తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి సమంత పెట్టిన పోస్ట్‌కు, జరుగుతున్న ప్రచారానికి మధ్య ఏదైనా సంబంధం ఉందా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. అయితే, ఈ పరిణామాలన్నీ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

Related posts

నాకు మిగిలిన సంతృప్తి అదే: సత్యనారాయణను తలచుకుని చిరంజీవి భావోద్వేగం…

Drukpadam

‘డోలో–650’ మాత్రలు తయారు చేసే ఫార్మా కంపెనీపై ఐటీ దాడులు!

Drukpadam

మరోసారి రచ్చ కెక్కిన ‘మంచు’ వివాదం

Ram Narayana

Leave a Comment