Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ఏపీలో మళ్లీ కొవిడ్ కలకలం.. విశాఖ, తిరుపతిలో కేసులు వెలుగులోకి!

ఏపీలో మళ్లీ కొవిడ్ కలకలం.. విశాఖ, తిరుపతిలో కేసులు వెలుగులోకి!
-చిత్తూరు జిల్లా వ్యక్తిలో కనిపించని లక్షణాలు
-జ్వరం, ఇతర లక్షణాలతో బాధపడుతున్న విశాఖ వాసి
-జినోమ్ సీక్వెన్సింగ్ కోసం విజయవాడకు నమూనాలు
-ఆసుపత్రి నుంచి చెప్పకుండా వెళ్లిపోయిన చిత్తూరు జిల్లా బాధితుడు

ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా రెండు కరోనా కేసులు వెలుగుచూశాయి. వీటిలో ఒకటి విశాఖపట్టణంలో నమోదు కాగా, మరోటి చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలానికి చెందిన ఓ వ్యక్తికి మొన్న కుప్పం పీహెచ్‌సీలో ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించగా కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అదే రోజు రాత్రి ఆ వ్యక్తిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడి ఐడీహెచ్ వార్డులోని కొవిడ్ కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. నిన్న ఆయనకు ఆర్టీపీసీఆర్ టెస్టు నిర్వహించి నమూనాలు సేకరించారు. అయితే, బాధితుడు నిన్న మధ్యాహ్నం ఎవరికీ చెప్పకుండా ఆసుపత్రి నుంచి మాయమయ్యాడు.

దీనిపై ఆసుపత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ సురేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. బాధితుడికి ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పటికీ అతడిలో ఎలాంటి లక్షణాలు లేవని (అసింప్టమాటిక్) తెలిపారు. దీంతో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసి శాంపిల్స్ తీసుకున్నామన్నారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, తనకు ఎలాంటి సమస్యలు లేవని, తనను పంపేయాలంటూ బాధితుడు సిబ్బందితో ఉదయం నుంచి వాదనకు దిగుతున్నాడని, మధ్యాహ్న భోజన సమయంలో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడని తెలిపారు.

మరోవైపు, విశాఖపట్టణంలోని రైల్వే న్యూ కాలనీకి చెందిన 42 ఏళ్ల వ్యక్తికి కూడా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఆయనలో లక్షణాలు కూడా ఉన్నాయి. జ్వరం, ఇతర లక్షణాలు కనిపించడంతో వైద్యుల సూచన మేరకు ఆయన కరోనా టెస్టు చేయించుకున్నాడు. అందులో అతడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయనను ఆరిలోవ హెల్త్ సిటీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అతడికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అతడి నుంచి నమూనాలు సేకరించి జినోమ్ సీక్వెన్సింగ్ కోసం విజయవాడలోని ల్యాబ్‌కు పంపారు.

Related posts

6 కోట్ల అస్ట్రాజెనికా టీకా డోస్ లను అందించనున్నాం : వైట్ హౌస్

Drukpadam

ఒక్క యాంటీబాడీతో కరోనాలోని అన్ని వేరియంట్లకు చెక్!

Drukpadam

ఉదయం 10 తర్వాత బయట వస్తే వాహనం జప్తు: డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరిక…

Drukpadam

Leave a Comment