Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పీలేరులో ఉద్రిక్తత… సబ్ జైలులో టీడీపీ కార్యకర్తలను పరామర్శించిన చంద్రబాబు!

పీలేరులో ఉద్రిక్తత… సబ్ జైలులో టీడీపీ కార్యకర్తలను పరామర్శించిన చంద్రబాబు!

  • పీలేరు సబ్ జైలులో టీడీపీ కార్యకర్తలు
  • పీలేరు వచ్చిన చంద్రబాబు
  • పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం
  • పెద్దిరెడ్డి పనైపోయిందని వ్యాఖ్యలు
  • పుంగనూరులో ఎగిరేది టీడీపీ జెండానే అని స్పష్టీకరణ

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ పీలేరు సబ్ జైలులో ఉన్న పుంగనూరు టీడీపీ కార్యకర్తలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన జైలు వద్ద మీడియాతో మాట్లాడారు. ఎంతమందిని జైల్లో పెడతారో మేమూ చూస్తాం అని తీవ్రస్వరంతో వ్యాఖ్యానించారు. టీడీపీ ఫ్లెక్సీలు ఎందుకు చించివేశారని ప్రశ్నిస్తే కేసులు పెడతారా? అంటూ ఆగ్రహించారు. పోలీసులు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.

అమాయకులను జైల్లో పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెట్టి తీవ్రంగా కొడుతున్నారని, భయపెట్టి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారని చంద్రబాబు ఆరోపించారు. తప్పు ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తారా? అని నిలదీశారు. సీఐ, ఎస్సై చాలా దారుణంగా వ్యవహరించారని అన్నారు. మా కార్యకర్తలు పండుగ జరుపుకోకుండా జైల్లో పెడతారా… మూల్యం చెల్లించుకోకతప్పదు అని హెచ్చరించారు.

ఇటీవల పుంగనూరు నియోజవర్గంలోని రొంపిచర్లలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పాల్గొన్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి పీలేరు సబ్ జైలుకు తరలించారు. జైలులో ఉన్న టీడీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు చంద్రబాబు ఇవాళ భారీ కాన్వాయ్ తో పీలేరు వచ్చారు. అయితే చంద్రబాబు కాన్వాయ్ లోని వాహనాలను పోలీసులు సీజ్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.

ఈ సందర్భంగా చంద్రబాబు పోలీసులపై మండిపడ్డారు. నేను పీలేరు రాకుండా అడ్డుకుంటారా? నేను ఎక్కడికి వస్తే అక్కడ పోలీసు యాక్ట్ 30 పెడతారా? అంటూ ప్రశ్నించారు. ఎవరికీ భయపడేది లేదని, రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘించే పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. చేయని తప్పుకు మా తమ్ముళ్లను జైల్లో పెట్టారు… మిమ్మల్ని ఇదే జైల్లో పెట్టే రోజు వస్తుంది… చట్టానికి ఎవరూ అతీతులు కారని స్పష్టం చేశారు.

“పోలీసులకు చెబుతున్నా… మీకు 60 వేల మంది సిబ్బంది ఉంటే నాకు 60 లక్షల మంది సైన్యం ఉంది. నేను గనుక పిలుపునిచ్చి జైలుకు పోవాలని చెబితే మా వాళ్లను పెట్టేందుకు మీ జైళ్లు చాలవు… మా ఇళ్లలోనే పెట్టాల్సి ఉంటుంది. మా ఇళ్లలో పెట్టాలన్నా మీకు మనుషులు లేరు… మళ్లీ మేమే కాపలా ఉండాల్సి ఉంటుంది. ఒకటే చెబుతున్నా… నా కార్యకర్తలను కొట్టిన పోలీసు అధికారులను మాత్రం వదిలిపెట్టేది లేదు. పెద్దిరెడ్డీ… నీ పనైపోయింది. పుంగనూరులో ఎగిరేది టీడీపీ జెండానే. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సైకోలు ఆకాశంలో తిరగలేరు. పీలేరులో ఉండేవాళ్లు ఇక్కడే ఉంటారు… ఇదే భూభాగంలో తిరగాలి… ఇదే పోలీసులు ఉంటారు… అదే పోలీసుల దగ్గర ఏంచేయాలో చేసిచూపిస్తా” అంటూ చంద్రబాబు ఘాటు హెచ్చరికలు చేశారు.

Related posts

క్విట్ ‘ఇండియా’ అంటూ విపక్ష కూటమిపై ప్రధాని మోదీ ఫైర్

Ram Narayana

కేటీఆర్… ఇలా చెప్పుకోవడానికి సిగ్గుగా అనిపించడంలేదా?: రేవంత్ రెడ్డి…

Drukpadam

ఈటలపై మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు…

Drukpadam

Leave a Comment