పొంగులేటికి రెండు పార్టీల ఆహ్వానం …ఇంకా నిర్ణయం తీసుకోలేదంటున్న పొంగులేటి…!
-లేదు …లేదు …ఢిల్లీ వెళ్లి అమిత్ షా ను కలిశారని ప్రచారం
-మా పార్టీలోకి రండని పొంగులేటికి సీఎల్పీ నేత భట్టి ఆహ్వానం
-మళ్ళీ ప్రజల్లోకి పొంగులేటి …
-ఆయన వెంట ఉన్న నాయకులు ఉంటారా ? జారుకుంటారా??
-కొత్త సమీకరణాలు జరిగే అవకాశం ఉందా?
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి…ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఉన్న ఆయన పేరు రాష్ట్రంలో తరచూ వినిపిస్తుంది. గత కొంతకాలంగా గులాబీ పార్టీలో ఆయనకు అవమానాలు జరుగుతున్నాయనే అభిప్రాయాలూ ఉన్నాయి. పొమ్మనలేక పొగపెట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు సెక్యూరిటీ తగ్గించింది ,చివరకు ఆయన వెంట ఉండే కాన్వాయ్ వాహనం తొలగించడం జరిగింది. ఇంటివద్ద గల అవుట్ పోస్ట్ తొలగించారు . దీంతో ఆయన బీఆర్ యస్ కు దూరమైయ్యారు. కాదు…కాదు బీఆర్ యస్ ఆయన్ను దూరం చేసుకుంది … దీంతో ఆయన గులాబీ పార్టీని విడతారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. అయితే ఆయన దాన్ని ఖండిస్తూ ఉన్నారు .కేసీఆర్ ను కలిసేందుకు కనీసం అనుమతి ఇవ్వకపోయినా కేటీఆర్ భరోసాతో ఇప్పటివరకు పార్టీలో కొనసాగారు . ఇక కొనసాగటం సాధ్యం కాదని తెలుసుకున్న పొంగులేటి పార్టీ పై తిరుగుబాటు జెండా ఎగరేశారు .జనవరి 1 వ తేదీన ఖమ్మంలో ఇంటి వద్ద జరిగిన వేడుకల్లో పార్టీ పై ఘాటు వ్యాఖ్యలే చేశారు . తరవాత పినపాక నియోజకవర్గ పర్యటనలో కూడా ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు పార్టీ వీడతారనేదానికి బలం చేకూర్చింది.
కారణాలు ఏమైనా ప్రజలలో పట్టు ఉన్న నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. కేసీఆర్ పిలుపు మేరకు , కేటీఆర్ చొరవతో గులాబీ పార్టీలో చేరిన పొంగులేటికి పార్టీలో అన్యాయం జరిగిందని …లేదు ఆయన వ్యక్తిగత పోకడలతో పార్టీకి నష్టం చేశారని వాదనలు ఉన్నాయి. పార్టీలో ఆయన్ను పక్కన పెట్టారు .అయితే ఆయన మాత్రం టికెట్ రాకపోయినా ప్రజలతో సంబంధాలను కొనసాగిస్తూనే ఉన్నారు . అందువల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి.
బీజేపీ ,కాంగ్రెస్ పార్టీల నుంచి పొంగులేటి ఆహ్వానాలు..
పొంగులేటి పార్టీ వీడటం ఖాయం అని తేలిపోవడంతో ఆయన ఏపార్టీలోకి వెళతారు అనేది ఆసక్తిగా మారింది . ఆయన కూడా ఎటు తేల్చుకోలేక పోతున్నారు . ఆయన అనుయాయుల్లో రెండు అభిప్రాయాలూ ఉన్నాయి. జిల్లా ప్రజల్లో కాంగ్రెస్ కు ఇంకా పట్టు ఉన్నందున అందులో చేరాలని అనేక నియోజకవర్గాల నుంచి వత్తిడి ఉన్నట్లు సమాచారం . అయితే ఆయనకు బీజేపీ ఢిల్లీ నేతల నుంచి ఫోన్లు వచ్చాయని ప్రచారం జరుగుతుంది. దానితో ఆయన రహస్యంగా ఢిల్లీ వెళ్లి అమిత్ షా తో మాట్లాడారని ప్రచారం జరుగుతుంది. ఆయన కార్యాలయం మాత్రం దీన్ని ఖండిస్తోంది . జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క స్వయంగా పొంగులేటిని పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు . ఢిల్లీ పెద్దలు సైతం ఆయనకోసం ప్రయత్నం చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం . భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య , భద్రాచం పార్టీ ఇంచార్జి డాక్టర్ తెల్లం వెంకటరావు , పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు , సత్తుపల్లికి చెందిన డాక్టర్ మట్టా దయానంద్ , మధిర కు చెందిన బొమ్మెర రామ్మూర్తి , డాక్టర్ కోట రాంబాబు , డీసీసీబీ మాజీ చైర్మన్ , మువ్వా విజయ బాబు , డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య , పాలేరు కు చెందిన మద్దినేని బేబీ స్వర్ణ కుమారి లాంటి నాయకులు ఆయన వెంట ఉన్నారు . మరి ఆయన తీసుకొనే నిర్ణయం నాయకులు అందరు సమ్మతిస్తారా ? విభేదిస్తారా ? అనేది ఆసక్తిగా మారింది.