దొడ్డి దారిన వచ్చిన నాయకుడు తాతా మధు …ప్రజా నాయకుడు పొంగులేటిని విమర్శించడమా…?
శీనన్న కు వస్తున్న ప్రజాదరణను చూసి బీఆర్ యస్ బెంబేలు
మధు ఎన్ని పార్టీలు మారారో …ఎక్కడనుంచి ఊడిపడ్డారో అందరికి తెలుసు …
స్థాయిని మరిచి అవాకులు చవాకులు మాట్లాడితే ప్రజలు బుద్ది చెప్పడం ఖాయం …
కేటీఆర్ పిలుపు మేరకు పొంగులేటి పార్టీ లో చేరితే అవమానిస్తారా ?
జిల్లాలో ప్రజాభిమానం ఉన్న నాయకుడు పొంగులేటి
బీఆర్ యస్ వచ్చిన తర్వాతనే కాంట్రాక్టులు చేయడంలేదు
గత 30 సంవత్సరాలుగా క్లాస్ వన్ కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డి
టీడీపీ ,కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కూడా కాంట్రాక్టర్ గానే ఉన్నారు .
తన రాజకీయ భవిష్యత్ కోసమే ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఆత్మీయ సమ్మేళనాలు
దొడ్డిదారిన వచ్చిన నాయకుడు తాతా మధు …ప్రజా నాయకుడు పొంగులేటిని విమర్శించడమా ? అని పొంగులేటి అనుయాయులు బీఆర్ యస్ విధానాలను తూర్పార పడుతూ…ఎమ్మెల్సీ మధుపై విమర్శలు గుప్పించారు .తొలుత సిపిఎం ,తర్వాత ప్రజారాజ్యం ,ఇప్పుడు బీఆర్ యస్ ఆయాచితంగా ఎమ్మెల్సీ పదవి వచ్చిందని దాన్ని అడ్డం పెట్టుకొని శ్రీనివాస్ రెడ్డి పై అవాకులు ,చవాకులు పేలడాన్ని మధిర కు చెందిన పొంగులేటి అనుయాయుడు డాక్టర్ కోట రాంబాబు ఆక్షేపించారు . ప్రజల ఆశీస్సులతో ప్రజాప్రతినిధిగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రజా నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అని అన్నారు మంగళవారం కె.వి.ఆర్ అండ్ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పొంగులేటి పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పార్టీలో పొంగులేటికి జరిగిన అవమానాలు, ఎదుర్కొన్న కష్టాలను ప్రజలకు వివరించి వారి అభిప్రాయాన్ని సేకరించి సరైన నిర్ణయం తీసుకునేందుకు పొంగులేటి ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. వేల సంఖ్యలో పొంగులేటి అభిమానులు వచ్చి శీనన్న ఒంటరి కాదని, మేము అందరం అండగా ఉంటామని ఈ సమ్మేళనం ద్వారా చాటి చెప్పినట్లు తెలిపారు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు శీనన్న కు వస్తున్న ఆదరణను చూసి బెంబేలు ఎత్తి మతిభ్రమించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు . పొంగులేటిని విమర్శించే స్థాయి ఎమ్మెల్సీ తాతా మధుకు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. జిల్లాలో పార్టీ అభ్యర్థులను ప్రజాప్రతినిధులగా ఒంటి చేత్తో గెలిపించిన సత్తా పొంగులేటికి మాత్రమే ఉందన్నారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ వారి అభిమానాన్ని చూరగొన్న పొంగులేటిపై విమర్శలు చేస్తున్న తాత మధు రాజకీయ అవివేకని దుయ్యబట్టారు .
పొంగులేటికి బీఆర్ఎస్ వల్లే కాంట్రాక్టులు వచ్చాయని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. శీనన్న గత 30 సంవత్సరాలుగా క్లాస్ వన్ కాంట్రాక్టర్ గా టిడిపి, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో కూడా పని చేసినట్లు తెలిపారు. బిఆర్ఎస్ లో కూడా కాంట్రాక్టులు పొందినప్పటికీ ఓపెన్ బిడ్ ద్వారా ఆయా కాంట్రాక్టులు దక్కించుకున్నారని తెలిపారు. ఒకవేళ ఓపెన్ బిడ్ లేకపోతే మీరు కమిషన్లు తీసుకొని ఆయా వర్కులు ఇచ్చినట్లు భావించాలా అని ప్రశ్నించారు.
మధిర మున్సిపాలిటీని పొంగులేటి వల్లనే కైవసం చేసుకున్న విషయం అందరికీ గుర్తుందని అన్నారు. కేటీఆర్ ఆదేశాలతో వచ్చి రెబల్స్ అభ్యర్థులను తప్పించి కౌన్సిలర్లను గెలిపించేందుకు అన్ని రకాల సాయం అందించిన విషయం మీకు తెలియదా అని అన్నారు. రెబల్స్ వల్ల ఓడిపోయిన ప్రజాప్రతినిధులు పొంగులేటి పై నిందలు వేయడం సిగ్గుచేటు అన్నారు. పొంగులేటికి ఉన్న ప్రజాభిమానం ప్రజాక్షేత్రంలో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. శ్రీనివాస్ రెడ్డి లక్షలాది గుండెలను తట్టిన గొప్ప నాయకుడని, జిల్లా ప్రజలు కష్టాల్లో ఉంటే వారికి ఆర్థిక సాయంతో పాటు అండగా నిలుస్తున్నారని తెలిపారు.
రైతుబంధు జిల్లా కమిటీ సభ్యులు మందడపు తిరుమలరావు మాట్లాడుతూ తాతా మధు వ్యవసాయ క్షేత్రంలోకి వెళితే విద్యుత్ సరఫరా ఎంత ఇస్తున్నారో తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు. గ్రామాల్లో పర్యటించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఎన్ని చోట్ల కట్టించారో తెలుసుకోవడానికి రావాలని కోరారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ హయాంలో ఇళ్ళు కట్టించారని, కానీ నేడు కేసీఆర్ అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఆశ కల్పించి ఇళ్లను నిర్మించలేదని విమర్శలు గుప్పించారు . రుణమాఫీ ఎంతమందికి చేశారో రైతుల సమక్షంలో విచారణ చేద్దామని సవాల్ చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో సత్తా చాటిన ప్రజల మనిషి పొంగులేటి అని, మీకు మాదిరిగా పరోక్షంగా వచ్చిన నాయకుడు కాదని ఎమ్మెల్సీ తాత మధుని ఎద్దేవా చేశారు. అదేవిధంగా ధరణిలో ఈనామ్ భూములకు సంబంధించి అనుభవదారుల కాలంలో రైతుల పేర్లు లేవని, దీనివల్ల సన్న,చిన్నకారు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నిజాం పరిపాలనలో ఉన్న భూముల వివరాలు నేడు ధరణిలో కనిపించడం లేదన్నారు.
విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, పొంగులేటి అనుయాయులు ఐలూరి వెంకటేశ్వరరెడ్డి, దేవిశెట్టి రంగారావు, యన్నం కోటేశ్వరరావు, ఎర్రగుంట రమేష్, వేమిరెడ్డి లక్ష్మారెడ్డి, తూమాటి అనంతరెడ్డి, గోళ్ళ ఉద్దండు, శ్రీనివాసరావు, అక్కినపల్లి నాగేశ్వరరావు, చిలకా వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.