Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

టర్కీలో నిన్నటి నుంచి 100 సార్లు కంపించిన భూమి!

టర్కీలో నిన్నటి నుంచి 100 సార్లు కంపించిన భూమి!

  • చిన్న చిన్న ప్రకంపనలు కొనసాగుతాయని ప్రకటించిన అమెరికా జియోలాజికల్ సర్వే
  • 5.0 నుంచి 6.0 తీవ్రతతో రావచ్చని వెల్లడి
  • బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న జనం

వరుస ప్రకంపనలతో టర్కీ (తుర్కియే) వణికిపోతోంది. నిన్న 7.8 తీవ్రతతో అతి భారీ భూకంపం సంభవించడంతో 4,400 మందికిపైగా చనిపోయారు. మరణాల సంఖ్య ఇంకా పెరుగుతోంది. మరోవైపు ప్రకంపనలు ఆగడం లేదు.

నిన్నటి ప్రధాన భూకంపం తర్వాతి నుంచి ఇప్పటి దాకా 100 కంటే ఎక్కువ సార్లు భూమి కంపించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. చిన్న చిన్న ప్రకంపనలు కొనసాగుతున్నాయని అమెరికా జియోలాజికల్ సర్వే విభాగం సైంటిస్టులు చెబుతున్నారు. 5.0 నుంచి 6.0 తీవ్రతతో కొంతకాలం ప్రకంపనలు కొనసాగవచ్చని హెచ్చరిస్తున్నారు.

ఈ రోజు రిక్టర్ స్కేల్‌పై 5.9 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. ప్రధాన భూకంపం సమయంలో కూలని భవనాలు కూడా ఈ ప్రకంపనలతో కూలిపోతున్నాయి. అప్పటికే బీటలువారి.. తీవ్రంగా దెబ్బతినడంతో ప్రకంపనల ధాటికి నిట్టనిలువునా కుప్పకూలుతున్నాయి.

టర్కీ, సిరియాలో వరుస ప్రకంపనలతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇళ్లలోకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. నిన్న రాత్రంతా చలిలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడిపారు. ఇప్పటివరకు 4,400 మందికిపైగా టర్కీ, సిరియాలో మరణించగా.. శిథిలాల కింద వేల మంది చిక్కుకున్నారని తెలుస్తోంది.

భారత్‌ సాయంపై తుర్కియే ప్రశంసల వర్షం

Earthquake Hit Turkey Thanks India

భారీ భూకంపంతో అతలాకుతలమైన తుర్కియే (టర్కీ)కు అండగా నిలిచిన భారత్‌పై ఆ దేశ రాయబారి ఫిరాత్ సునెల్ ప్రశంసల వర్షం కురిపించారు. భారత్‌ను ఫ్రెండ్ అని సంబోధించిన ఆయన.. అవసరంలో అక్కరకు వచ్చిన వారే నిజమైన స్నేహితులని సోమవారం ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. టర్కీ, హిందీ భాషల్లో ‘దోస్త్’ ఉమ్మడి పదంగా ఉందని చెప్పుకొచ్చారు. అంతకుమునుపు.. భారత విదేశాంగ శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ తుర్కియే రాయబారితో సమావేశమయ్యారు. అక్కడి ప్రజలకు భారత్‌ తరపున సంఘీభావం తెలిపారు.

భూకంపం సమాచారం అందగానే భారత్ తుర్కియేకు వైద్య సిబ్బంది, సహాయ సామగ్రిని తరలించింది. జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు, మెడికల్ టీమ్స్‌ను టర్కీకి పంపించేందుకు నిర్ణయించినట్టు ప్రధాన మంత్రి కార్యాలయం అంతకుముందు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయంలో తుర్కియే ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. మొత్తం రెండు వందల మంది సిబ్బంది ఉన్న 2 జాతీయ విపత్తు నిర్వహణ బృందాలను తుర్కియే సహాయార్థం పంపించేందుకు నిర్ణయించినట్టు పేర్కొంది. ప్రధాన మంత్రి ముఖ్య సలహాదారు పీ.కే.మిశ్రా ఆధ్వర్యంలో సౌత్‌ బ్లాక్‌లో తుర్కియేకు అందించాల్సిన తక్షణ సాయంపై సమావేశం జరిగింది.

తుర్కియే, సిరియా దేశాల్లో సోమవారం సంభవించిన భారీ భూకంపం.. ఈ శతాబ్దంలోని భారీ భూకంపాల్లో ఒకటిగా రికార్డుల కెక్కింది. శిథిలమైన భవనాలు, ప్రజల ఆర్తనాదాలతో ఆ ప్రాంతాలు మరుభూమిని తలపిస్తున్నాయి. ప్రకృతి ప్రకోపానికి బలైన వారి సంఖ్య ప్రస్తుతం 4 వేలు దాటింది. ఈ సంఖ్య మరింతగా పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Related posts

ఢిల్లీ లిక్కర్ స్కాం ..డిప్యూటీ సీఎం సిసోడియా అరెస్ట్…!

Drukpadam

జాబిల్లిపై నీటి జాడలు గుర్తించిన చైనా!

Drukpadam

జీవితాన్ని వదిలేసి.. మాతృభూమి నుంచి పారిపోతున్నా: అందరినీ కదిలిస్తున్న ఆఫ్ఘన్​ యువతి భావోద్వేగ పోస్ట్!

Drukpadam

Leave a Comment