తెలంగాణ నూతన సెక్రటేరియట్ కు ముహూర్తం ఫిక్స్ …?
అంబేద్కర్ జయంతి రోజే తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం!
ఏప్రిల్ 14న ప్రారంభించాలని నిర్ణయం
ప్రారంభోత్సవానికి తమిళనాడు సీఎం, ఝార్ఖండ్ సీఎం, అంబేద్కర్ మనవడు
బహిరంగ సభపై రాని క్లారిటీ …
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ కారణంగా ఆగిపోయిన తెలంగాణ నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ నెల 17న సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. తాజాగా, ప్రభుత్వం మరో ముహూర్తం ఖరారు చేసింది. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రారంభించాలని నిర్ణయించి ముహూర్తం కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
ప్రారంభోత్సవానికి హేమాహేమీలు
సచివాలయ ప్రారంభోత్సవానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, జేడీయూ నేత అలన్‌సింగ్, అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్లను ప్రభుత్వం ఆహ్వానించినట్టు తెలుస్తోంది. కాగా, ఇదివరకటి ప్రణాళిక ప్రకారం సచివాలయ ప్రారంభోత్సవం అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ముహూర్తం మారిన నేపథ్యంలో ఈ సభ ఉంటుందా? లేదా? అన్న విషయంలో ఇంకా క్లారిటీ లేదు .
మంచి డిజైన్ తో నిర్మించిన ఈ సచివాలయ భవనం చూపరులను ఆకర్షిస్తుంది . కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ భవనంపై అనేక విమర్శులు ఉన్న వాటిని లెక్కచేయకుండా నిర్మాణాన్ని పూర్తీ చేసి తన మార్క్ ప్రదర్శించారు . అయితే కేసీఆర్ పుట్టిన రోజున సచివాలయం ప్రారంభించాలని ముందుగా అనుకున్న అనుకోకుండా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది . దీంతో కార్యక్రమాన్ని వాయిదా వేసిన కేసీఆర్ సర్కార్ ఏప్రిల్ 14 అంబెడ్కర్ జయంతి రోజున ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. అయితే ఇంకా అధికారిక సమాచారం మాత్రం రాలేదు …