సోనూ నిగమ్ పై ముంబైలో దాడి.. !
- సహాయకుడిని తోసేసిన ఉద్ధవ్ థాకరే వర్గం ఎమ్మెల్యే కుమారుడు
- ఘటనలో మెట్లపై నుంచి కిందపడ్డ సోనూ నిగమ్
- సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలోనే గందరగోళం జరిగిందన్న పోలీసులు
- సోనూ ఫిర్యాదుతో ఘటనపై విచారణ చేస్తున్నట్లు వెల్లడి
బాలీవుడ్ లో ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ పై సోమవారం దాడి జరిగింది. ముంబైలోని చెంబూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో సోనూ నిగమ్ ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో సోనూ నిగమ్ స్టేజీ పై నుంచి కిందికి వస్తుండగా ఎమ్మెల్యే ప్రకాష్ ఫటేర్ పెకర్ కుమారుడు స్వప్నిల్ ఎదురు వెళ్లడంతో గందరగోళం నెలకొంది. తనను అడ్డుకోవడానికి ప్రయత్నించిన సోనూ నిగమ్ సహాయకుడు రబ్బానీని స్వప్నిల్ పక్కకు తోసేశాడు.
మిగతా వారిని కూడా తోసేస్తూ సోనూ నిగమ్ దగ్గరకు వెళ్లి సెల్పీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ గందరగోళంలో వెనక నుంచి తనను ఎవరో తోసేశారని, దీంతో కిందపడ్డానని సోనూ నిగమ్ మీడియాకు చెప్పారు. తనకు రక్షణగా వచ్చిన రబ్బానీకి గాయాలయ్యాయని వివరించారు.
ఈ ఘటనపై సోనూ నిగమ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణలో ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాష్ ఫటేర్ పెకర్ కుమారుడు స్వప్నిల్ ఈ గందరగోళానికి కారణమని తేలిందన్నారు. అయితే, ఈ ఘటన వెనక ఎలాంటి రాజకీయ కోణం లేదని పోలీసులు తేల్చిచెప్పారు. సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ఇలా జరిగిందని, ఉద్దేశపూర్వకంగా జరిగినట్లు భావించడం లేదని పోలీసులు తెలిపారు. వీడియో ఫుటేజ్ ను పరిశీలించాక బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.