తిరుపతి నగరానికి 893 ఏళ్ల చరిత్ర… ఘనంగా ఉత్సవాలు!
- ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో వేడుకలు
- 1130 ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భవించిందన్న కరుణాకర్ రెడ్డి
- శ్రీ రామానుజాచార్యుల వారు శంకుస్థాపన చేశారని వెల్లడి
తిరుపతి నగరం భారతదేశంలోనే కాదు… ప్రపంచవ్యాప్తంగా ఆధ్మాత్మిక కేంద్రాలుగా విలసిల్లుతున్న నగరాల్లో ముఖ్యమైనదిగా గుర్తింపు పొందింది. తిరుమల సందర్శనకు వచ్చే భక్తులు తిరుపతి, దాని పరిసరాల్లో వివిధ ఆలయాలను సందర్శిస్తుంటారు.
తిరుపతి నగరానికి అత్యంత సుదీర్ఘమైన చరిత్ర ఉంది. విశిష్టాద్వైత సిద్ధాంతకర్త రామానుజాచార్యుల వారు 893 ఏళ్ల కిందట తిరుపతి నగరానికి శంకుస్థాపన చేశారు.
ఈ నేపథ్యంలో, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి నగర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గోవిందరాజస్వామి ఆలయం నుంచి భజనలు, కోలాటాలతో, కళాకారుల ప్రదర్శనలతో వైభవంగా యాత్ర చేపట్టారు.
ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. “సాక్షాత్తు శ్రీ రామానుజాచార్యుల వారి చేతుల మీదుగా 1130వ సంవత్సరం ఫిబ్రవరి 24న తిరుపతి నగరం ఆవిర్భవించింది. శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో అర్చక వ్యవస్థను స్థిరీకరించి, శఠకోపయతి అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు.
తిరుమల స్వామివారి సన్నిధిలో సేవలందించే అర్చకుల నివాసం తిరుపతిలో ఉండాలన్న సదాశయంతో నాడు శ్రీమహావిష్ణువు ప్రతిరూపమైన గోవిందరాజస్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారు. దాంతోపాటు, ఈ నగరానికి శంకుస్థాపన చేశారు. వెంకటేశ్వరస్వామి అంశగా భావించే రామానుజాచార్యుల వారి చేతుల మీదుగా ఈ తిరుపతి నగరం ఏర్పడింది. ఇవాళ భగవత్సంకల్పంతో తిరుపతి వాసులం అందరం ఈ వేడుకలు జరుపుకుంటున్నాం” అని కరుణాకర్ రెడ్డి వివరించారు.