యూనిఫాంపై బీజేపీ కండువా వేసుకున్న పోలీసు అధికారి.. విచారణకు ఆదేశం!
- యూపీలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా పని చేస్తున్న అశుతోష్
- వైరల్ అవుతున్న యూనిఫాంపై బీజేపీ కండువా వేసుకున్న ఫొటో
- అశుతోష్ పై ఫిర్యాదు చేసిన మాజీ ఐజీ
పార్టీల మీద అభిమానంతో కొందరు చేస్తున్న పనులు మొత్తం పోలీస్ వ్యవస్థకే మచ్చ తెస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. పురాన్ పూర్ లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా పని చేస్తున్న అశుతోష్ రఘువంశీ అనే అధికారి తన యూనిఫాంపై బీజేపీ కండువా వేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై యూపీకి చెందిన మాజీ ఐజీ అమితాబ్ ఠాకూర్ ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యాదర్శి, పలువురు సీనియర్ పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
అశుతోష్ ను వెంటనే సస్పెండ్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో అమితాబ్ కోరారు. పోలీసు అధికారుల రూల్ ఆఫ్ కండక్ట్ కు వ్యతిరేకంగా అశుతోశ్ ప్రవర్తించాడని చెప్పారు. తాను కూడా ఎన్నో ఏళ్ల పాటు పోలీసు అధికారిగా పని చేశానని… ఏనాడు కూడా ఏ ఒక్క పార్టీ గుర్తును బహిరంగంగా ప్రదర్శించలేదని అన్నారు. ఇలాంటి చేష్టలు పోలీసుల గురించి రాంగ్ ఇమేజ్ ను ప్రజల్లోకి తీసుకెళ్తాయని చెప్పారు. ఈ నేపథ్యంలో అశుతోశ్ పై ఫిలిబిత్ ఎస్పీ అతుల్ శర్మ విచారణకు ఆదేశించారు.