ఖమ్మం జిల్లాలో పోటీ ముక్కోణమా …? బహుముఖమా …??
బీఆర్ యస్ , కాంగ్రెస్, బీజేపీ కూటముల మధ్య పోటీ
వైయస్సార్ టీపీ , బీఎస్పీ లు కూడా రంగంలో ..
ఉమ్మడి జిల్లా రాజకీయాలపై పెరుగుతున్న ఆసక్తి
మొత్తం 10 నియోజకవర్గాలు …అందులో మూడే జనరల్
పాలేరు నుంచి పోటీచేస్తానని ప్రకటించిన షర్మిల ,
పోటీలో ఉండనున్న టీడీపీ బీఎస్పీ, ఎం ఎల్ పార్టీలు
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా ఉండబోతున్నాయి. రాష్ట్రంలో తీర్పులకు ఎప్పుడు భిన్నంగా నిలిచే ఖమ్మం ఈసారి ఎలా ఉండబోతుంది . అనే ఆసక్తి నెలకొన్నది రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. జిల్లాలో బలమైన నేతలను గుర్తించి వారిని నాయన, భయానా ఒప్పించడం ద్వారా తమ పార్టీలో చేర్చుకొని సత్తా చాటాలని చూస్తుంది.జిల్లాలో కొద్దోగొప్పో ప్రభావం చూపగలిగిన తెలుగుదేశం ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది. ఒంటరిగా వెళుతుందా ?లేక ఎవరితోనైనా జతకడుతుందా ..? అనే చర్చ కూడా జరుగుతుంది. ఇక షర్మిల పాలేరు నుంచి పోటీచేస్తానని ప్రకటించారు .ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో బీఎస్పీ , కొద్దో గొప్పో పట్టు ఉన్న ఎం ఎల్ పార్టీలు రంగంలో ఉండబోతున్నాయి. దీంతో బహుముఖ పోటీ తప్పేలా లేదు .
ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వాటిలో ఖమ్మం జిల్లాలో ఐదు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు సీట్లు ఉన్నాయి. విచిత్రమేమంటే రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా ఈ రెండు జిల్లాలో ఐదు ఎస్టీలకు , 2 సీట్లు ఎస్సీలకు మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు రిజర్వడ్ స్థానాలుగా ఉన్నాయి. అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం ఒక్కటి మాత్రమే జనరల్ కేటగిరిలో ఉండగా మిగతా నాలుగు స్థానాలు ఎస్టీ నియోజకవర్గాలుగా ఉన్నాయి. ఇక ఖమ్మం జిల్లాలో జిల్లా కేంద్రమైన ఖమ్మం తో పాటు పాలేరు నియోజకవర్గాలు జనరల్ గా ఉన్నాయి.సత్తుపల్లి ,మధిర నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వడ్ కాగా , వైరా ఎస్టీ రిజర్వడ్ గా ఉంది . దీంతో ఉమ్మడి జిల్లాలో పోటీ చేయాలనుకున్న వారికీ ఇబ్బందికరంగా మారింది . ఖమ్మం జిల్లాలో రెండు జనరల్ సీట్లు ఉండటం, పోటీచేసేవారి సంఖ్య ఎక్కువ , సీట్లు తక్కువగా ఉండటంతో అన్ని పార్టీలకు సంకటంగానే మారింది .
1983 లో తెలుగుదేశం రాకముందు జిల్లాలో కాంగ్రెస్ ,కమ్యూనిస్టులు మధ్య హోరాహోరి ఫైట్ ఉండేది. అయినప్పటికీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను అందున్న జలగం వెంగళరావు లాంటి నేతలకు కమ్యూనిస్టులు ఎదురొడ్డి నిలబడ్డారు ..తర్వాత టీడీపీ వచ్చింది. దానితో లెఫ్ట్ పార్టీలు కొన్ని రోజులు కుస్తీ ,మరికొన్ని రోజులు దోస్తీ చేశారు . అప్పుడు కూడా లెఫ్ట్ ల హవానే కొనసాగింది . కానీ నేడు పరిస్థితిలు మారాయి. కారణాలు ఏమైనా రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజనను సమర్థించిన సిపిఐ మరియు ఎం ఎల్ పార్టీలు , వ్యతిరేకించిన సిపిఎం లు ఒకరకంగా చెప్పాలంటే ఎర్రజెండా పార్టీలు బలహీన పడ్డాయి. ఇప్పుడు బీఆర్ యస్ హవా కొనసాగుతుంది… జిల్లాలో 2014 లోగాని 2018 లో జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీకి ఉమ్మడి జిల్లాలో వచ్చిన సీట్లు ఒక్కటి మాత్రమే అదికూడా ఒకసారి కొత్తగూడెం,మరోసారి ఖమ్మం లలో గెలుపొందింది .ఈ సీట్లు గెలవడానికి గులాబీ పార్టీ ప్రభావంకన్నా ,పోటీచేసిన వ్యక్తుల బలమే కారణమేనే అభిప్రాయాలు ఉన్నాయి.
సిపిఐ , సిపిఎం లకు దూరంగా ఉన్న బీఆర్ యస్ పార్టీ మునుగోడు ఎన్నికల దగ్గర నుంచి వారితో స్నేహం చేస్తుంది . కమ్యూనిస్టులు కూడా, బీజేపీకి వ్యతిరేకంగా నిలిచిన బీఆర్ యస్ తో కలిసి పోటీచేసేందుకు సిద్దపడుతున్నారు . అయితే వామపక్షాలకు ఇచ్చే సీట్లు విషయం చర్చనీయంశంగా ఉంది …. వామపక్షాలు తమకు బలం ఉందని కోరుతున్న సీట్లలో ప్రస్తుతం బీఆర్ యస్ సిట్టింగులు ఉన్నారు. సిట్టింగులు ఎవరికీ వారు తమ దగ్గర కాకుండా మరో చోట ఇవ్వాలని ప్రత్యక్షంగా ,పరోక్షంగా అధినేత కేసీఆర్ ను కోరుతున్నారు .
అయితే రాష్ట్రంలో ఎన్ని సీట్లు లెఫ్ట్ పార్టీలు కోరుతున్నాయి. అందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్ని ఉన్నాయనేది ప్రధాన సమస్య …లెఫ్ట్ పార్టీలకు 25 వేలకు పైగా ఓట్లు ఏ ఏ నియోజకవర్గాల్లో ఉన్నాయి అనే విషయంపై కేసీఆర్ ఇంటలిజెన్స్ నివేదికలు తెప్పించుకున్నట్లు సమాచారం ..ఖమ్మం జిల్లాలో తాజా రాజకీయ పరిణామాల్లో 25 వేలకు పైగా కమ్యూనిస్టులకు ఓట్లు ఉన్న నియోజకవర్గాలు కేవలం రెండు మూడుకు కు మించి లేవని బీఆర్ యస్ నాయకుల వాదన … అన్ని కూడా లేవని కొందరు నేతలు అంటున్నారు … లేదు మాకు 25 వేలకు మించి ఓట్లు ఉన్న నియోజకవర్గాలు ఐదు నుంచి ఆరు ఉమ్మడి జిల్లాలో ఉన్నాయని అందువల్ల తమకు ఆ సీట్లు కేటాయించేల్సిందేనని పట్టుపడుతున్నారు కమ్యూనిస్టులు . కమ్యూనిస్టులు ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సీట్లు తీసుకోవాలని కోరుతున్నారు బీఆర్ యస్ శ్రేణులు …
ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఆరు సీట్లు గెలిచింది .వారిలో నలుగురు కాంగ్రెస్ కు బై చెప్పి గులాబీ గూటికి చేరారు …వీరికి తోడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ,టీడీపీ నుంచి గెలిచిన సత్తుపల్లి ,అశ్వారావుపేట శాసన సభ్యులు కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు . కాంగ్రెస్ కు ఎవరితో పొత్తు ఉంటుంది . అభ్యర్థులు ఎవరు..? అనేది తేలాల్సి ఉంది . ఇక మొత్తం 10 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను పోటీకి పెట్టి తమ సత్తా చాటుతామని బీజేపీ ధీమాగా ఉంది . పొంగులేటి తమ పార్టీలో చేరబోతున్నారని ఆపార్టీ నాయకులు చెపుతున్నారు . వీరే కాకుండా పాలేరు నుంచి పోటీచేస్తానని ప్రకటించిన షర్మిల , ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీలు కూడా రంగంలో ఉండబోతున్నాయి.ఎం ఎల్ పార్టీలకు కూడా ఇల్లందు , పినపాక నియోజకవర్గాల్లో కొంత బలం ఉంది . దీంతో జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో బహుముఖ పోటీ ఉండవచ్చునని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం …. ఈసారి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా తీర్పు గతంలోలా భిన్నంగా ఉంటుందా …? లేదా అని ఆసక్తి నెలకొన్నది …అయితే పార్టీలు పొత్తులు ,ఎత్తులు , ఎవరు ఎక్కడ పోటీచేస్తారనేది తేలకుండా ఎవరికీ అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పడం తొందరపాటు అవుతుంది….