దేశంలో అరుదైన శస్త్రచికిత్స.. అన్న వాహిక మార్చిన వైద్యులు!
- టాయిలెట్ క్లీనర్ తాగిన మహిళ
- పూర్తిగా దెబ్బతిన్న అన్న వాహిక
- ఆహారం, నీరు కూడా తీసుకోలేని పరిస్థితి
- 9 గంటల సుదీర్ఘ ఆపరేషన్ తో కొత్త అన్న వాహిక అమరిక
దేశంలో అత్యంత అరుదైన, క్లిష్టమైన సర్జరీని భోపాల్ ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఓ మహిళకు కొత్త అన్న వాహిక అమర్చి ప్రాణం నిలిపారు. ఓ మహిళ టాయిలెట్ క్లీనర్ ను తాగడం వల్ల ఆమె అన్న వాహిక (ఈసోఫాజియస్) తీవ్రంగా దెబ్బతిన్నది. ఆహారం తీసుకోలేని స్థితిలో ఉన్న ఆమెను ఎయిమ్స్ వైద్యుల వద్దకు తీసుకెళ్లారు.
సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, ఈఎన్ టీ వైద్యులు సంయుక్తంగా సదరు మహిళకు నూతన అన్న వాహిక అమర్చే శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. బాధిత రోగి, ఆమె కుటుంబ సభ్యులతో విస్తృతంగా చర్చించి, వారి ఆమోదం అనంతరం సర్జరీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.
ఈ శస్త్రచికిత్సకు నాయకత్వం వహించిన సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం హెడ్ (భోపాల్ ఎయిమ్స్) డాక్టర్ విశాల్ గుప్తా మాట్లాడుతూ.. పది నెలలుగా నోటి ద్వారా రోగి ఎలాంటి ఆహారం, నీరు తీసుకోలేకపోతున్నట్టు చెప్పారు. ఫీడింగ్ పైపు ద్వారా తీసుకుని జీవించగలిగినట్టు తెలిపారు.
‘‘కొత్త అన్న వాహిక ఏర్పాటు చేసే క్రమంలో ఆమె స్వరం కాపాడడం మాకు పెద్ద సవాలు. గొంతు భాగంలో వాయిస్ బాక్స్ సమీపంలో కొత్త ఫుడ్ పైపును అమర్చాలి. ఈ సౌండ్ బాక్స్ అన్నది ఆమె స్వరాన్ని నియంత్రించడం తో పాటు అక్కడి నుంచి వెళ్లే వాయు మార్గాన్ని కాపాడుతుంది’’అని వికాస్ గుప్తా వివరించారు. మొత్తానికి 9 గంటల పాటు సర్జరీతో విజయవంతంగా కొత్త అన్న వాహికను అమర్చారు.