ముఖ్యమంత్రి కేసీఆర్ కు వినతి పత్రం అందజేస్తున్న తమ్మినేని వీరభద్రం
నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 20 వేలు పరిహారం ఇవ్వాలి: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు 20వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బోనకల్ మండల పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు తమ్మినేని వీరభద్రం ఈ సందర్భంగా పలు సమస్యలపై గురువారం వినతి పత్రం అందజేశారు. అకాల వర్షాలు, వడగల్లు, పిడుగులు పడటం వలన పెద్ద ఎత్తున పంటల నష్టం వాటిల్లిందన్నారు. 5 లక్షల ఎకరాలలో రూ 1250 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా ప్రకటించిందన్నారు. కానీ వాస్తవం ఇందుకు రెట్టింపుగా ఉంటుందని తెలిపారు. ఈనెల 16 నుండి 20 వరకు కురిసిన అకాల వర్షాల వలన 25 జిల్లాలలో దాదాపు 7 లక్షల ఎకరాలలో పంటలు నష్టం వాటిని తెలిపారు. పసుపు, మిరప, జొన్న, నువ్వులు, పొద్దు తిరుగుడు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. పండ్ల తోటలలో పుచ్చ, కర్బూజా, మామిడి పంటల దెబ్బతిన్నాయన్నారు. గొర్రెలు, మేకలు, ఎద్దులు, పిడుగులు వలన చనిపోయాయన్నారు. పిడుగు పడి కొత్తగూడెం మండలంలో ధరమ్ సోత్ శంకర్ మరణించాడని తెలిపారు. ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న, వరి, బొప్పాయి, మామిడి తోటల సుమారు 90,000 ఎకరాలలో పంటలకు తీవ్ర నష్టం జరిగినట్లు తెలిపారు. పిడుగు పడి 1500 కోళ్లు మరణించాయన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో పిడుగు పడి మూడు గ్రామాలలో 13 దుక్కిటేట్లు మరణించాయని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. నష్టం మొత్తం గా రెండువేల కోట్లుగా ఉంటుందని తెలిపారు. కోతకు వచ్చిన పంటలు చేతికి రాకుండా పోయాయని తెలిపారు. వరి, మొక్కజొన్న , మిరప, పసుపు పంటలకు వేలకోట్లలో పెట్టుబడులు పెట్టి అన్నదాతలు నష్టపోయారన్నారు. రాష్ట్రంలోనే మొక్కజొన్న విస్తీర్ణంలో 30 శాతం నష్టం జరిగినప్పటికీ 43, 424 మందికి చెందిన 57,855 ఎకరాలు మాత్రమే నష్టం జరిగినట్లు అధికారులు ప్రకటించడం బాధాకరమన్నారు. వాస్తవ గణాంకాలు సేకరించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఇదే సంవత్సరం వానాకాలంలో 12 లక్షల ఎకరాలలో పంటలు దెబ్బతిన్నాయన్నారు. అందులో ఏడు లక్షల ఎకరాలలో పత్తి పంట దెబ్బతిన్నదన్నారు. ఆరుగురు రైతుల మరణించారన్నారు. వరి, పత్తి దిగుబడులు సగానికి సగం తగ్గాయి అన్నారు. మంత్రులు పర్యటించి వచ్చారన్నారు. 15 ఫైనాన్స్ కమిషన్ కింద కేటాయించిన 629 కోట్లు కూడా విడుదల చేయలేదన్నారు. తెలంగాణలో వడగండ్ల వానలు పరిపాటిగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం విపత్తు సహాయం కింద 2023 మార్చి 14న రూ.1816 కోట్లు విడుదల చేసిందన్నారు. కానీ అందులో తెలంగాణకు రూపాయి సహాయం కూడా ఇవ్వలేదని తెలిపారు. 2022-23 సంవత్సరంలో వానాకాలం, యాసంగి కలిపి నాలుగు వేల కోట్లు రైతులకు నష్టం వాటిల్లిందని ఆ విన్నపత్రంలో కోరారు. ప్రధానంగా కౌలు రైతుల తీవ్రంగా నష్టపోయారని, నేరుగా పంటల సాగుచేసిన కౌలు రైతులకే పరిహారం చెల్లించాలని ఆ వినతి పత్రంలో ముఖ్యమంత్రిని కోరారు.
కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రకృతి వైపరీతంగా పరిగణించి తక్షణ సహాయం క్రింద తెలంగాణ రాష్ట్రానికి రెండు వేల కోట్లు మంజూరు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాలని ఆ వినతి పత్రంలో కోరారు. ప్రభుత్వం నష్టపోయిన పంటలన్నింటిని వెంటనే సమగ్రంగా సర్వే చేయించాలని, ఆహార పంటలకు ఎకరాకు 20,000 రూపాయలు వాణిజ్య పంటలకు ఎకరాకు 40,000 రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వాలని ఆ వినతిపత్రంలో కోరారు. నష్టపోయిన ఇండ్లు, పశువులకు కూడా పరిహారం చెల్లించాలని తమ్మినేని వీరభద్రం ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందజేసిన వినతి పత్రంలో కోరారు.