Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అవినీతిపరులంతా ఒక్కటవుతున్నారు.. మా పద్ధతి మారదు: విపక్ష నేతలపై మోదీ ఫైర్!

అవినీతిపరులంతా ఒక్కటవుతున్నారు.. మా పద్ధతి మారదు: విపక్ష నేతలపై మోదీ ఫైర్!

  • అవినీతిపరులు, ఆర్థిక నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నామన్న మోదీ
  • కొన్ని పార్టీలు అవినీతిపరులను కాపాడే ప్రయత్నం చేస్తున్నాయని మండిపాటు
  • ఇప్పటి వరకు రూ. 10 లక్షల కోట్లు జప్తు చేశామని వెల్లడి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన క్రమంలో విపక్ష నేతలు ఒక్కతాటిపైకి వస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ కు మద్దతుగా బీజేపీని వ్యతిరేకిస్తున్న వివిధ పార్టీలకు చెందిన నేతలు నిలుస్తున్నారు. రాహుల్ పై చర్యలను వారు ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో విపక్ష నేతలపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. అవినీతిపరులంతా ఒక్కటవుతున్నారని ఆయన విమర్శించారు.

కేంద్ర వ్యవస్థలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందంటూ 14 విపక్ష పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి. ఈ నేపథ్యంలోనే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. మన రాజ్యాంగ వ్యవస్థలకు బలమైన పునాదులు ఉన్నాయని ఆయన చెప్పారు. ఎవరిపైన అయినా ఈ వ్యవస్థలు చర్యలు తీసుకుంటే… వెంటనే వాటిని విమర్శిస్తూ, టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. కొన్ని పార్టీలు అవినీతిపరులను కాపాడే పనిని చేపట్టాయని అన్నారు.

అవినీతిపరులు, ఆర్థిక నేరగాళ్లపై తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని మోదీ అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మనీలాండరింగ్ చట్టం కింద కేవలం రూ. 5 వేల కోట్లు మాత్రమే జప్తు చేశారని… తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూ. 10 లక్షల కోట్లను జప్తు చేశామని చెప్పారు. ఆర్థిక నేరాలకు పాల్పడి పారిపోయిన 20 వేల మందిని పట్టుకున్నామని తెలిపారు. తాము చేస్తున్న మంచి పనులు కొందరికి నచ్చడం లేదని, తమపై కోపాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. విపక్ష నేతలు చేస్తున్న తప్పుడు ఆరోపణల కారణంగా అవినీతిపై తాము అవలంబిస్తున్న విధానం మారదని చెప్పారు.

మరోవైపు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన పార్టీల్లో కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, జేడీయూ, బీఆర్ఎస్, ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీ, శివసేన (ఉద్ధవ్ థాకరే), నేషనల్ కాన్ఫరెన్స్, ఎన్సీపీ, డీఎంకే, వామపక్షాలు ఉన్నాయి. సీబీఐ, ఈడీ వంటి రాజ్యాంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని పిటిషన్ లో ఈ పార్టీలు ఆరోపించాయి. కాంగ్రెస్ ను అనుక్షణం విమర్శించే కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు కూడా రాహుల్ గాంధీకి మద్దతుగా నిలవడం విశేషం.

Related posts

ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టును ధ్రువీకరించిన సీఐడీ…

Drukpadam

రోడ్డు పక్కన మహిళను చూసి కాన్వాయ్ ఆపించిన సీఎం జగన్… 

Drukpadam

యాదాద్రిలో నాసిరకం పనులు …భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి ఫైర్!

Drukpadam

Leave a Comment