Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రాజకీయ చరిత్రను తిరగరాసిన రోజు మార్చి 29: చంద్రబాబు

రాజకీయ చరిత్రను తిరగరాసిన రోజు మార్చి 29: చంద్రబాబు

  • హైదరాబాదులో టీడీపీ 41వ ఆవిర్భావ సభ
  • నాడు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎన్టీఆర్ మీటింగ్ పెట్టారన్న బాబు   
  • అప్పటికప్పుడు పార్టీ పేరును ప్రకటించారని వెల్లడి 
  • చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ వుంటుందని వ్యాఖ్య  

హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో టీడీపీ 41వ ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు వేదికపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. జ్యోతి ప్రజ్వలనం చేసి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు… రాజకీయ చరిత్రను తిరగరాసిన రోజు మార్చి 29 అని వెల్లడించారు. తనకు ఎంతో గుర్తింపునిచ్చిన తెలుగు జాతి కోసం నాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టారని వివరించారు.

తెలుగువాళ్ల కోసం ఏంచేయాలని ఎమ్మెల్యే క్వార్టర్స్ ఒక మీటింగ్ పెడితే, ఆ విషయం ఆ నోటా ఈ నోటా అందరికీ తెలిసిపోయి భారీగా తరలి వచ్చారని, దాంతో ఈ రాష్ట్రం కోసం ఎంతటి త్యాగమైనా చేస్తానని చెప్పి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఎన్టీ రామారావు అని చంద్రబాబు పేర్కొన్నారు.

“మనసులోంచి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజున పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన ప్రిపేర్ అయి చెప్పలేదు. తెలుగు జాతి నాది.  ఆ తెలుగు దేశం కోసమే పార్టీ పెడుతున్నా… దాని పేరే తెలుగుదేశం అని అప్పటికప్పుడు ప్రకటించారు” అని వివరించారు.

పసుపు రంగు శుభానికి చిహ్నమని, అందుకే నాడు ఎన్టీఆర్ ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నారని చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ జెండాలో నాగలి రైతు చిహ్నం, రాట్నం కార్మికుల చిహ్నం, గుడిసె పేదవాడికి చిహ్నం అని వివరించారు. చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందని చంద్రబాబు ఉద్ఘాటించారు. తెలుగు ప్రజంలదరి కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు.

ఆ రోజున నన్ను ఎవరూ అర్థం చేసుకోలేదు: చంద్రబాబు

Chandrababu speech in TDP Foundation Day meeting

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే ఆలోచించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. హైదరాబాదులో నిర్వహించిన పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన ప్రసంగించారు.

“దేశవిదేశాల్లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరపాలని నిర్ణయించాం. ఇవాళ మొట్టమొదటి మీటింగ్ పెట్టాం… మళ్లీ రాజమండ్రిలో మహానాడు నిర్వహిస్తాం. ఈ మధ్యలో 98 సభలు జరుపుతాం. ఇది మొదటి మీటింగ్ అయితే, రాజమండ్రిలో 100వ మీటింగ్ జరుగుతుంది.

తెలుగుజాతి గర్వపడే విధంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో, అన్ని గ్రామాల్లో చేస్తాం, ఆంధ్రప్రదేశ్ లో అన్ని గ్రామాల్లో, అన్ని ప్రాంతాల్లో చేస్తాం. ఇతర రాష్ట్రాల్లో కూడా చేస్తాం. ఆస్ట్రేలియాలో చేస్తాం, అమెరికాలో కూడా చేస్తాం. ఎన్టీఆర్ వంటి మహనీయుడ్ని అందరూ గౌరవించుకోవాలి. అలాంటి మహనీయుడ్ని గౌరవిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రూ.100 ప్రత్యేక నాణెం తీసుకువచ్చింది. అందుకు ప్రధాని మోదీకి మరొక్కసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అని వివరించారు.

టీడీపీకి ఎప్పుడూ స్పష్టమైన విజన్ ఉందని అన్నారు. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయని, 93లో ఇంటర్నెట్ విప్లవం వచ్చిందని తెలిపారు. “ఈ రెండింటిని అందిపుచ్చుకుంటే ప్రపంచంలో తెలుగుజాతికి తిరుగుండదని ఆ రోజు నుంచే భావించాం. అందుకే విజన్ 2020 రూపొందించాం. 25-35 ఇంజినీరింగ్ కాలేజీలు ఉంటే వాటి సంఖ్యను 300 చేశాం. నన్ను ఆ రోజు ఎవరూ అర్ధం చేసుకోలేదు. ఇంజినీరింగ్ కాలేజీలు ఎందుకన్నారు. కానీ ఇవాళ ఆ కాలేజీ వల్ల ఎందరి జీవితాలు మారాయో, ఎందరు కోటీశ్వర్వులు అయ్యారో అందరికీ తెలుసు.

పాతికేళ్ల కిందట హైదరాబాద్ ఎలా ఉంది, ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉంది? హైటెక్ సిటీ తీసుకువచ్చాను, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశాను. ఆర్టీసీలో కండక్టర్లుగా ఆడబిడ్డలను పనిచేస్తున్నారు. అదీ తెలుగుదేశం గొప్పదనం. ఈ సందర్భంగా సంస్కరణలకు ఆద్యుడు పీవీ నరసింహారావుకు ఘన నివాళి అర్పిస్తున్నాను. దేశాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించారు. నాడు ఆయన తీసుకువచ్చిన సంస్కరణలను నేను ధైర్యంగా అనుసరించి రెండో తరం సంస్కరణలు రూపొందించాను. వాటికి టెక్నాలజీ జోడించాను.

విజన్ 2020ని రూపొందించింది అప్పుడే. చాలామంది దాన్ని 420 విజన్ అన్నారు. ఇప్పుడా 420లు అడ్రస్ లేకుండా పోయారు. నాడు సెల్ ఫోన్ తిండి పెడుతుందా అన్నారు. ఇవాళ అందరి వద్ద సెల్ ఫోన్లు ఉన్నాయి. భర్త లేకుండా భార్య ఉంటుంది… భార్య లేకుండా భర్త ఉంటాడు… కానీ సెల్ ఫోన్ లేకుండా ఎవరూ ఉండరు. నేను సెల్ ఫోన్ తీసుకువచ్చినట్టు చెప్పుకుంటున్నానని చాలామంది ఎగతాళి చేస్తున్నారు. సెల్ ఫోన్ తీసుకువచ్చింది నేను కాదు… నేను ఇచ్చిన రిపోర్ట్ వల్లే భారత్ లో సెల్ ఫోన్లు వచ్చాయి. ఇదే కాదు… అనేక సంస్కరణలకు టీడీపీ పాటుపడింది” అని చంద్రబాబు వివరించారు.

తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు

Chandrababu appreciates TDP Telangana wing

తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ సభ హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేశారు. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వంలోని తెలంగాణ టీడీపీ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చంద్రబాబు తెలిపారు.

ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ పేరిట వారు చేపడుతున్న కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా సాగుతోందని కొనియాడారు. తెలంగాణ టీమ్ బాగా పనిచేస్తోందని, ఇంకా స్పీడ్ పెంచాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కూడా తప్పకుండా టీడీపీకి పూర్వవైభవం వస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో టీడీపీ రావాల్సిన అవసరం ఉందని, ఇది చారిత్రక అవసరం అని స్పష్టం చేశారు.

“ఈ సందర్భంగా తెలుగుజాతి మూడు నిర్ణయాలు స్వీకరించాలి. 2047కి భారత్ దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలో భారతీయులకు గౌరవం లభిస్తుంది. అందులో తెలుగుజాతి అగ్రస్థానాన నిలవాలి. ఆర్థిక అసమానతలు తగ్గించాలి… పేదలకు అండగా నిలివాలి. మీరు బాగుండడమే కాదు, మీతో సమానంగా కొంతమందిని పైకి తీసుకువచ్చే బాధ్యత మీది… మిమ్మల్ని గౌరవించే బాధ్యత మాది. కుటుంబాలను దత్తత తీసుకోవాలి.  అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు, వృత్తులకు న్యాయం చేయాలి. ఇదే తెలుగుదేశం పార్టీ లక్ష్యం” అని వివరించారు.

కాగా, టీడీపీలో శాశ్వత సభ్యత్వం కోసం రూ.5 వేలు రుసుం నిర్ణయించామని చంద్రబాబు వెల్లడించారు. టీడీపీని క్రియాశీలకం చేసేందుకు దోహదపడాలని పిలుపునిచ్చారు. ప్రజలను భాగస్వాములను చేసి పార్టీ నడపాలనేది తన సంకల్పం అని చంద్బరాబు స్పష్టం చేశారు. తెలంగాణకు, ఏపీకి వ్యత్యాసం ఉండొచ్చని, కానీ సంకల్పం గొప్పదైతే అందరం పైకి వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు.

అలాంటి సంకల్పానికి నాంది పలికిన రోజు మార్చి 29 అని, టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మరొక్కసారి తెలియజేస్తున్నానని వివరించారు. సర్వం కోల్పోయినా పార్టీ జెండా మోస్తున్న నా కుటుంబ సభ్యుల్లాంటి కార్యకర్తలకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నానని పేర్కొన్నారు.

 

Related posts

చంద్రబాబును జైల్లో పెట్టడం జగన్ కు నష్టం: ప్రొఫెసర్ హరగోపాల్

Ram Narayana

మున్నేరు బాధితులకు ఎంపీ పార్థసారథిరెడ్డి రూ. కోటి సహయం…

Ram Narayana

కరోనాతో మాకు సంబంధం లేదు.. మా విధులు మేము నిర్వహించాం—సుప్రీంకోర్టుకు తెలిపిన ఈసీ

Drukpadam

Leave a Comment