బీజేపీ ,బీఆర్ యస్ లకు వైయస్సార్ తెలంగాణ పార్టీ దూరం … గట్టు
-రెండు పార్టీలు కామన్ అండర్ స్టాండింగ్ తో ఉన్నాయని అభిప్రాయం
-వైయస్సార్ తెలంగాణ పార్టీ పై నిర్బంధాలు కొనసాగుతున్నాయని విమర్శ
-చివరకు ఆఫీస్ స్టాఫ్ ను కూడా భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజం ..
-ఎన్ని నిర్బంధాలు పెట్టిన ప్రజాసమస్యలపై పోరాటం ఆపబోమని వెల్లడి
కేంద్రంలోని బీజేపీకి రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ యస్ కు వైయస్సార్ తెలంగాణ పార్టీ దూరంగా ఉంటుందని ఆపార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు గట్టు రామచందర్ రావు తెలిపారు . లోటస్ పాండ్ లో సోమవారం పార్టీ పీఏసీ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీని అణగదొక్కాలని , కట్టడి చేయాలనీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ యస్ ప్రభుత్వం నిర్బంధకాండ ప్రయోగిస్తుందని అన్నారు .చివరకు తమ పార్టీ కార్యాలయంలో పనిచేసే ఆఫీస్ స్టాఫ్ ను కూడా వదల కుండా పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించారు . పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా తమ అధ్యక్షురాలు షర్మిలను కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా కట్టడి చేస్తున్నారని ప్రభుత్వం చర్యలపై ధ్వజమెత్తారు .ఎన్ని నిర్బంధాలు పెట్టిన తాము ప్రజల కోసం పోరాడుతూనే ఉంటామని తెలిపారు .
ఐక్యకార్యాచరణ ద్వారా ప్రజాసమస్యలపై ఉద్యమాలు చేయాలనీ పీఏసీ నిర్ణయించిందని అందుకు కలిసి వచ్చేపార్టీలతో ముందుకు పోవాలని అభిప్రాయపడ్డట్లు పేర్కొన్నారు . …బీజేపీ , బీఆర్ యస్ కు వ్యతిరేకంగా తమ కార్యాచరణ ఉంటుందన్నారు . బీజేపీ , బీఆర్ యస్ పార్టీలను తాము విడి విడిగా చూడటంలేదన్నారు …వాళ్ళ సంగతి వీళ్ళు ,వీళ్ళ సంగతి వాళ్ళు తేలుస్తామని అంటారు కానీ ఎవరు తేల్చారని అందువల్ల ఇద్దరి మధ్య ఎదో కామన్ అండర్ స్టాండింగ్ ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు . తమ పార్టీ పీఏసీలో కూడా ఇదే అంశం చర్చకు వచ్చిందని అన్నారు . రాష్ట్రంలో తమ అధ్యక్షురాలు చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుంచి మద్దతు లభించడంతో దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్న అధికార బీఆర్ యస్ పాదయాత్రలపై దాడి చేయిస్తుందని అన్నారు . తమపై బీఆర్ యస్ కార్యకర్తలు దాడి చేస్తే వారిపై కేసులు పెట్టాల్సిన పోలీసులు తమపైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు .ఇదే నా ప్రజాస్వామ్యం , భావస్వేచ్ఛ అని ప్రశ్నించారు .తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని భావించిన యువత అవిరాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇక నీళ్లు ,నిధులు గురించి చెప్పాల్సిన పనిలేదని ,అవినీతి ,అక్రమాల్లో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని విమర్శలు గుప్పించారు . మీడియా సమావేశంలో పీఏసీ సభ్యులు రామిరెడ్డి ,గుడిపల్లి కవిత తదితరులు పాల్గొన్నారు …