మంత్రి ఆదిమూలపు సురేశ్ అంతు చూస్తానన్న చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ జరిపించాలి: డొక్కా మాణిక్య వరప్రసాద్
యర్రగొండపాలెంలో నిన్న చంద్రబాబు పర్యటన
పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు
మంత్రిని అంతు చూస్తానంటూ చంద్రబాబు బెదిరించడం సరికాదన్న డొక్కా
సీఎం జగన్ దళితులకు ఎంతో మేలు చేస్తున్నారని కితాబు
దళితులపై చంద్రబాబు తన వైఖరేంటో చెప్పాలని డిమాండ్
యర్రగొండపాలెం ఘటనపై వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందించారు. మంత్రి ఆదిమూలపు సురేశ్ పై చంద్రబాబు వ్యాఖ్యలు దారుణమని పేర్కొన్నారు. ఆదిమూలపు సురేశ్ చేసిన డిమాండ్ పై స్పష్టత ఇవ్వాల్సింది పోయి, అంతు చూస్తానంటూ చంద్రబాబు బెదిరించడం సరికాదని అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
దళితులపై చంద్రబాబు తన వైఖరేంటో చెప్పాలని నిలదీశారు. చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, ఘర్షణలు సృష్టించాలనుకోవడం సరికాదని డొక్కా మాణిక్య వరప్రసాద్ హితవు పలికారు. మంత్రి ఆదిమూలపు సురేశ్ కు భద్రత కల్పించాలని ఆయన పేర్కొన్నారు.
దళితులకు సీఎం జగన్ ఎంతో మేలు చేశారని, అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా పరిపాలన అందిస్తున్నారని కొనియాడారు.
యర్రగొండపాలెం ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్న ఎన్ఎస్ జీ
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో నిన్న సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసనలు, ఆయన కారుపై రాళ్ల దాడి జరిగాయి. ఈ ఘటనలో చంద్రబాబు భద్రతా విధుల్లో ఉన్న ఎన్ఎస్ జీ కమాండెంట్ సంతోష్ కుమార్ కు తల పగిలింది.
ఈ ఘటనను ఢిల్లీలోని ఎన్ఎస్ జీ ప్రధాన కార్యాలయం తీవ్రంగా పరిగణిస్తోంది. యర్రగొండపాలెంలో జరిగిన పరిణామాలపై ఆరా తీసింది. నిన్న జరిగిన పరిణామాలపై ఎన్ఎస్ జీ బృందం తమ ప్రధాన కార్యాలయానికి సమాచారం అందించింది. ఆందోళనకారులను చంద్రబాబు సమీపానికి రానివ్వడం పట్ల ఎన్ఎస్ జీ ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
గతేడాది నందిగామలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. చంద్రబాబు రోడ్ షోపై రాళ్ల దాడి జరగ్గా, ఓ భద్రతాధికారికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో, నందిగామ, యర్రగొండపాలెం ఘటనలపై ఎన్ఎస్ జీ నివేదిక రూపొందిస్తోంది. దీనిపై ఇవాళ గానీ, రేపు గానీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.