అమెరికాలో ఎంట్రీ ఇచ్చిన మేడిన్ ఇండియా బండి…!
- హంటర్ 350 బైక్ ను తయారుచేస్తున్న రాయల్ ఎన్ ఫీల్డ్
- గతేడాది నుంచి భారత్ లో విక్రయాలు
- భారత్ కంటే అమెరికాలో రెట్టింపు ధర
దర్జా ఉట్టిపడే మోటార్ సైకిళ్లతో రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ దశాబ్దాలుగా భారతీయుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. బుల్లెట్, క్లాసిక్ 350 వంటి బ్లాక్ బస్టర్ మోడళ్లతో గణనీయమైన స్థాయిలో విక్రయాలు నమోదు చేస్తున్న రాయల్ ఎన్ ఫీల్డ్ గతేడాది ఆగస్టులో హంటర్ 350 పేరుతో కొత్త మోడల్ తీసుకువచ్చింది. ఇది పూర్తిగా మేడిన్ ఇండియా బైక్. కేవలం 6 నెలల వ్యవధిలోనే లక్షకు పైగా బైకులు అమ్ముడుపోయాయి.
ఇప్పుడీ కొత్త బండిని రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ అమెరికాలో ప్రవేశపెట్టింది. రాయల్ ఎన్ ఫీల్డ్ తయారీ మెటియోర్ 350, క్లాసిక్ 350 బైకులు తయారైన జె-ప్లాట్ ఫాంపైనే హంటర్ 350 కూడా నిర్మాణం జరుపుకుంది.
కాగా, భారత్ లో హంటర్ 350 ఎక్స్ షోరూం ధర రూ.1.49 లక్షల నుంచి రూ.1.71 లక్షల వరకు ఉండగా… అమెరికాలో అంతకు రెట్టింపు ధరను నిర్ణయించారు. ఇందులోని మెట్రో వేరియంట్ ఎక్స్ షోరూం ప్రారంభ ధర భారత్ లో రూ.1.67 లక్షలుగా ఉంది. అమెరికాలో హంటర్ 350 మోనోటోన్ షేడ్స్ బైకుల ధర రూ.3.26 లక్షలు కాగా, హంటర్ 350 డ్యూయల్ టోన్ షేడ్స్ ఉన్న బైకుల ధర రూ.3.43 లక్షలుగా పేర్కొన్నారు.
ప్రస్తుతానికి రాయల్ ఎన్ ఫీల్డ్ అమెరికాలో కేవలం హంటర్ 350 మెట్రో వేరియంట్ నే తీసుకువచ్చింది. ఇందులో విశేషాలను పరిశీలిస్తే… 349 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అమర్చారు. 6,100 ఆర్పీఎం, 27 ఎన్ఎం వద్ద 19.9 హార్స్ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది.
5 స్పీడ్ గేర్ బాక్స్, డ్యూయల్ చానల్ ఏబీఎస్, చిన్న డిజిటల్ నేవిగేషన్ యూనిట్ తో కూడిన అనలాగ్ కన్సోల్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, ముందు, వెనుక డిస్క్ బ్రేకులు, ఎల్ఈడీ టైల్ ల్యాంప్ దీంట్లో ప్రత్యేకతలు.
రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ హంటర్ 350 బైకులను తమిళనాడు ప్లాంట్ లో తయారుచేస్తోంది. భారత్ లో ఎలాంటి మోడల్ ను విక్రయిస్తున్నారో, అదే మోడల్ ను అమెరికాకు ఎగుమతి చేస్తోంది.ఇప్పటికే ఈ బైకును ఇండోనేషియా, జపాన్, థాయ్ లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలకు ఎగుమతి చేస్తోంది.