600కు 600 మార్కులు సాధించిన నందినికి సీఎం స్టాలిన్ హామీ!
- 12వ తరగతి పరీక్షల్లో భళా అనిపించిన విద్యార్థిని
- ఉన్నత చదువులకు ప్రభుత్వం సహాయం అందిస్తుందని హామీ
- నందినిని చూసి గర్విస్తున్నామన్న సీఎం స్టాలిన్
12వ తరగతి పరీక్షల్లో 600/600 మార్కులు సాధించిన దిండిగల్ జిల్లాకు చెందిన ఎస్ నందినిని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్టాలిన్ సత్కరించారు. ఆమె ఉన్నత చదువులకు తమిళనాడు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తుందని హామీ ఇచ్చారు. ఈ రోజు ఉదయం చెన్నైలోని తన క్యాంపు కార్యాలయంలో విద్యార్థిని తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రిని కలిశారు. దిండిగల్‌లోని అన్నామలైయార్ మిల్స్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదువుతున్న నందిని కామర్స్ గ్రూప్‌ని ఎంచుకుంది. ఎకనామిక్స్, తమిళం, ఇంగ్లీష్, అకౌంటెన్సీ, కామర్స్, కంప్యూటర్ అప్లికేషన్‌లలో వందకు వంద సాధించింది. మొత్తంగా 600 మార్కులకు 600 సాధించి భళా అనిపించింది.
నందినిని చూసి గర్విస్తున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్పారు. తదుపరి చదువులకు ఏ సాయం కావాలన్నా అడగాలని అన్నారు. నందిని తండ్రి కార్పెంటర్ పని చేస్తున్నారు. సీఎం స్టాలిన్ ను కలిసిన అనంతరం నందిని మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నుండి బహుమతులు తీసుకోవడం ఆనందంగా ఉందని చెప్పింది. తనకు ఆడిటర్ కావాలని ఉందని పేర్కొంది. తాను సాధించిన విజయం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అంకితమని చెప్పింది.