దారుణం.. 6 నెలల కిందట భార్యను.. ఇప్పుడు కూతుర్ని నరికి చంపిన సైకో తండ్రి..
- పెద్దపల్లి జిల్లా మంథనిలో కూతురుని గొడ్డలితో నరికి చంపిన సదయ్య
- ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఘాతుకం
- బయటికొచ్చి మరో వ్యక్తిపైనా దాడికి యత్నించిన నిందితుడు
- ఆరు నెలల కిందట భార్యను చంపి.. ప్రస్తుతం బెయిల్ పై బయట తిరుగుతున్న సదయ్య
పెద్దపల్లి జిల్లా మంథనిలో దారుణం చోటుచేసుకుంది. ఓ కసాయి తండ్రి కన్న కూతురినే అతి కిరాతకంగా చంపేశాడు. మంథని మండలం భట్టుపల్లి గ్రామానికి చెందిన గుండ్ల సదయ్య గురువారం ఉదయం తన కూతురు రజిత (10)ని గొడ్డలితో నరికి హత్యచేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతను ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. తర్వాత బయటకు వచ్చిన సదయ్య.. దూపం శ్రీనివాస్ అనే వ్యక్తిపై కూడా దాడికి పాల్పడ్డాడు.
దీంతో సదయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైకో సదయ్యను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ పోలీసులను గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కొంతకాలంగా సదయ్య మానసిక పరిస్థితి బాగోలేదని స్థానికులు చెప్పారు. ఆరు నెలల క్రితం భార్యను కూడా సదయ్య హత్య చేశాడని తెలిపారు. సదయ్య బెయిల్ పై బయటికి వచ్చాడని, గ్రామంలోని జనాలపై తరచూ దాడులకు పాల్పడుతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు.