ఒరిగిపోతున్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయం!
- ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఆలయం
- 12,800 అడుగుల ఎత్తులో కొలువైన శివుడు
- 8వ శతాబ్దంలో కత్యూరీ పాలకుల హయాంలో నిర్మాణం
- 10 డిగ్రీల వరకు ఒరిగిపోతున్న ఇతర కట్టడాలు
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయంగా రికార్డులకెక్కిన ఉత్తరాఖండ్‌లోని తుంగనాథ్ ఆలయం ఐదారు డిగ్రీలు ఒరిగిపోతున్నట్టు పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. ఈ ఆలయం గర్వాల్ హిమాలయాల్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో 12,800 అడుగుల ఎత్తున కొలువై ఉంది. ఆలయం ఉన్న భవన సముదాయంలోని ఇతర కట్టడాలు పది డిగ్రీల వరకు ఒరిగిపోతున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఈ ఆలయాన్ని రక్షిత కట్టడాల జాబితాలో చేర్చాలని కోరినట్టు పేర్కొన్నారు.
ప్రభుత్వం కూడా అందుకు ఓకే చెప్పిందని, జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా ప్రకటించే చర్యలు ప్రారంభించిందని, అందులో భాగంగా ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు నోటిఫికేషన్ జారీ చేసినట్టు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తున ఉన్న ఆలయంగా గుర్తింపు పొందిన తుంగనాథ్ శివాలయాన్ని 8వ శతాబ్దంలో కత్యూరీ పాలకులు నిర్మించారు. ఇప్పుడీ ఆలయాన్ని బద్రీ కేదార్ ఆలయ కమిటీ పర్యవేక్షిస్తోంది.