- శవపేటిక, పార్లమెంటు భవనం ఫొటోలను షేర్ చేసిన ఆర్జేడీ
- ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టేస్తున్నారని చెప్పడమే తమ ఉద్దేశమన్న ఆర్జేడీ నేతలు
- అలా పోల్చిన వారిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలన్న బీజేపీ
- వచ్చే ఎన్నికల్లో అదే శవపేటికలో జనం మిమ్మల్ని పాతిపెడతారన్న బీజేపీ నేత గౌరవ్ భాటియా
నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ బీహార్‌లోని లాలు ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పార్లమెంటు నూతన భవనం డిజైన్‌ను శవపేటికతో పోలుస్తూ ట్వీట్ చేసింది. ఓ వైపు పార్లమెంటు భవనం, మరోవైపు శవపేటిక ఫొటోలను షేర్ చేస్తూ ‘ఏంటిది?’ అని ప్రశ్నించింది. దీనిపై ఆర్జేడీ నేత శక్తి సింగ్ యాదవ్ స్పందిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టేస్తున్నారని చెప్పడమే తమ ఉద్దేశమని అన్నారు. దేశం దీనిని అంగీకరించడం లేదని పేర్కొన్నారు. పార్లమెంటు అనేది ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిదని, చర్చలకు అది స్థానమని వివరించారు.
ఈ ట్వీట్‌పై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అంతే తీవ్రంగా స్పందించింది. పార్లమెంటు భవనాన్ని శవపేటికతో పోల్చిన వారిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఆ పార్టీ నేత సుశీల్ కుమార్ మోదీ అన్నారు. 2024లో ప్రజలు మిమ్మల్ని అదే శవపేటికలో పాతిపెట్టడం ఖాయమని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా హెచ్చరించారు.
ఆర్జేడీ ‘శవపేటిక’ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్.. కొత్త పార్లమెంట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు
కొత్త పార్లమెంట్ భవనం శవపేటికలా ఉందంటూ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ‘‘వాళ్లు (ఆర్జేడీ) పార్లమెంటును శవపేటిక అని ఎందుకు పిలుస్తున్నారు? వాళ్లు ఇంకేమైనా మాట్లాడి ఉండొచ్చు. ఇంకేదైనా ఉదాహరణ చెప్పి ఉండొచ్చు. ఈ యాంగిల్ ఎందుకు తీసుకురావాలి?’’ అని ప్రశ్నించారు.
ఆర్జేడీకి స్టాండ్ అంటూ ఏదీ లేదని ఎద్దేవా చేశారు. కొన్నిసార్లు వాళ్లు లౌకికవాదం గురించి చెబుతారని, మరికొన్ని సార్లు బీజేపీతో తెగదెంపులు చేసుకుని బయటికి వచ్చిన నితీశ్ కుమార్ ను ముఖ్యమంత్రిని చేస్తారని మండిపడ్డారు.
ఇదే సమయంలో పాత పార్లమెంటు భవనంపైనా ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాత పార్లమెంట్ భవనానికి ఢిల్లీ ఫైర్ సర్వీస్ నుంచి క్లియరెన్స్ కూడా లేదని చెప్పారు. కొత్త పార్లమెంటు భవనాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత ప్రచారం కోసం ప్రధాని ప్రారంభిస్తున్నారని విమర్శించారు.
ప్రధాని పట్టాభిషేకంలా ఫీల్ అవుతున్నారు: రాహుల్ గాంధీ విమర్శలు!
కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ సహా 20 దాకా ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. రాష్ట్రపతి కాకుండా ప్రధాని ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ఓపెనింగ్ కు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాయి.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. పార్లమెంటును ప్రధాని ప్రారంభించడానికి వ్యతిరేకంగా ట్వీట్ చేశారు. ‘‘పార్లమెంట్ అనేది ప్రజల గొంతుక. కానీ ప్రధాని మాత్రం ఈ ప్రారంభోత్సవ వేడుకను పట్టాభిషేకంలా భావిస్తున్నారు’’ అంటూ ట్వీట్ చేశారు.