శీనన్న నిర్ణయం ఇంకెప్పుడన్న …పొంగులేటి అభిమానులు …!
ఎదో ఒక నిర్ణయం తీసుకో అన్న
మీ వెంటే మేముంటాం
ఎన్ని ఇబ్బందులు అయిన ఎదుర్కొంటాం ..
తన అభిమానులు శీనన్న గా పిలుచుకునే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్ణయం కోసం ఆయన అభిమానులు చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు . మొదట్లో ఆయన కొంతకాలం ఆగాలని చెప్పినదానికి సరే అన్నారు .కానీ ఆయన పార్టీపై తిరుగు బాటు జెండా ఎగరవేసి ఐదు నెలలు గడుస్తుంది. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు …దానిపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. మల్లగుల్లాలు పడుతున్నారు. ఏ పార్టీలోకి వెళ్ళితే రాజకీయంగా తనకు తన అనుయాయులకు మేలు జరుగుతుందనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. కాంగ్రెస్ , బీజేపీ లనుంచి ఆహ్వానాలు ఉన్నాయి. మంచి ఆఫర్లు కూడా ఉన్నాయి . వాటిపైన కూడా ఆలోచిస్తామని చెపుతున్నారు గాని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ఆయన చెప్పడంలేదు ….
దీంతో విసిగి పోయిన మీడియా వాళ్ళు సైతం దండం పెడతాం ఏ పార్టీలోకి వెళుతున్నారో చెప్పండని అడుగుతున్నారు. నాన్చుడు ధోరణివల్ల నష్టం జరుగుతుందని హితులు ,సన్నిహితులు పేర్కొంటున్నారు . అభిమానులు శీనన్న సాగదీయకుండా ఇక నిర్ణయం చెప్పన్నా అంటున్నారు . ఆయన మాత్రం ఇదిగో అదిగో అంటున్నారు . చిరునవ్వులతో త్వరలోనే నిర్ణయమని అంటున్నారు. తాజాగా జూన్ రెండవవారం కశ్చితంగా నిర్ణయం చెపుతానని అంటున్నారు . అంతే మరో 15 నుంచి 20 రోజులు అన్నమాట …మరి అప్పటికైనా చెపుతారా మల్ల వాయిదా వేస్తారా …?అనే మీమాంస అనేక మందిలో మెదులుతుంది…
ఆయన రెండు శపథాలు చేశారు . అందులో ఒకటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 సీట్లలో బీఆర్ యస్ అభ్యర్థులను గెలవకుండా చేయడం …రెండవది రాష్ట్రంలో కేసీఆర్ ను తిరిగి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం …రెండు ఆయనకు పెద్ద సవాలే …
బీజేపీలోకి పొతే …
ఆయన బీజేపీలోకి పొతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 సీట్లలో బీఆర్ యస్ ను ఓడించగలరా …అంటే ప్రస్నార్ధకమే …గత రెండు పర్యాయాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అప్పటి టీఆర్ యస్ ఇప్పటి బీఆర్ యస్ కు ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది…. అదే పాయింట్ మీద మాట్లాడితే రాజకీయ అజ్ఞానం అవుతుంది. అప్పుడు పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి…అందులో బీజేపీలోకి వెళ్ళితే ఇక్కడ బీజేపీ ఉనికి పెద్దగా లేదు …గతంలో ఈ జిల్లాలో బీజేపీ గెలిచినా దాఖలాలు లేవు… ఒక వేళ ఆయన కేంద్ర మంత్రి పదవి ఇస్తే గిస్తే …కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. అది జరుగుతుందా …ఆయినా ఎన్నికలకు ముందు బీజేపీలో చాలామంది సీనియర్లు ఉండగా వారిని కాదని పొంగులేటి ఇస్తే ఒప్పుకుంటారా ..? అయినప్పటికీ వృతం చెడ్డ ఫలితం దక్కకపోవచ్చు …. రాష్ట్రంలో కూడా బీజేపీ గత కొన్ని నెలల క్రితం ఉన్న ప్రభావం లేదని అంటున్నారు . కర్ణాటక ఎన్నికల తర్వాత మరి బీజేపీ రాష్ట్రంలో డీలా పడింది. అలాంటప్పుడు కేసీఆర్ ను ఓడించాలంటే బీజేపీతో సాధ్యం అవుతుందా …అంటే చెప్పలేని పరిస్థితి ….
ఇక కాంగ్రెస్ లో చేరితే …
కాంగ్రెస్ లో చేరితే ఆయన అనుకున్న లక్ష్యం ఉమ్మడి జిల్లాలో నెరవేరే అవకాశాలు తోసిపుచ్చలేమని అంటున్నారు . రాజకీయ విశ్లేషకులు … అయితే ఒకటి అర సీటు అటు ఇటు అయినా జిల్లాలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు కు తోడు పొంగులేటి ఇమేజ్ తోడు అయితే ఫలితాలు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే ఆయన జిల్లాలో అనేకమందిని నియోజకవర్గ ఇంచార్జిలుగా పెట్టారు . వారు తమకు పొంగులేటి తరుపున టికెట్స్ వస్తాయని నమ్మకంతో ఉన్నారు .అది జరగకపోతే ఆయనకు అసమ్మతి సెగలు తప్పక పోవచ్చు ….
ఇక మూడవ ఆలోచన జి -30 అంటే తమ అనుయాయులు అనుకున్నవారిని రాష్ట్రంలోని మూడు నాలుగు జిల్లాల్లో 30 చోట్ల పోటీచేయించడం ద్వారా సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపొంది కింగ్ మేకర్ పాత్ర పోషించాలని అనుకున్నారు . అయితే దానిపై ఎవరికీ సదాభిప్రాయంలేదు . దీంతో పార్టీలో చేరడమే బెటర్ అనే అభిప్రాయానికి దాదాపుగా వచ్చారు . అయితే కాంగ్రెస్ లో చేరాలని అనుయాయులనుంచి వత్తిడి ఉన్నా కాంగ్రెస్ లో ఎన్ని సీట్లు ఇస్తారనేది ఇప్పడు వేయి డాలర్ల ప్రశ్నగా ఉంది…. పొంగులేటి ఇప్పుడు వేసే ప్రతి రాజకీయ అడుగు భవిష్యత్ రాజకీయాలకు పునాదిగా మారుతుంది … చూద్దాం ఏమి చేస్తారో ….